అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టార్చ్ బేరర్ గా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి దొరకడం ప్రజల అదృష్టమని వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై మాట్లాడిన ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. 

నవ్యాంధ్రను నవశకానికి తీసుకెళ్లే టార్చ్ బేరర్ వైయస్ జగన్ అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె ప్రతీ 30 సంవత్సరాలకు బ్రతుకు ఆలోచన మారుతోందని దాన్ని సినిమా లాంగ్వేజ్ లో ట్రెండ్ అంటారని రోజా చెప్పుకొచ్చారు. 

అదే బ్రతుకు ఆలోచనను రాజకీయ నాయకులు తరం అంటారని ప్రజలైతే జనరేషన్ అంటారని చెప్పుకొచ్చారు. ఒక జనరేషన్ ను ముందుకు తీసుకెళ్లే వ్యక్తిని టార్చ్ బేరర్ అంటారని ఆ టార్చ్ బేరర్ వైయస్ జగన్ మాత్రమేనని చెప్పుకొచ్చారు. 

చిమ్మ చీకట్లలో చిన్నాభిన్నమైన ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు వైయస్ జగన్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే అందుకు నిదర్శనమంటూ చెప్పుకొచ్చారు. రాబోయే 30 ఏళ్లు టార్చ్ బేరర్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తారని రోజా ఆకాంక్షించారు.