జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు బుర్రలేదని వైసిపి ఎంఎల్ఏ రోజా మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ పవన్ పై ధ్వజమెత్తారు. జగన్, వైసిపిపై పవన్ చేసిన వ్యాఖ్యలపై రోజా  ఓ రేంజిలో రెచ్చిపోయారు. పవన్ చేస్తున్న పనులకు, మాట్లాడుతున్న మాటలకు ఏమాత్రం పొంతన లేదన్నారు. ఎప్పుడు ఇబ్బందులు వస్తాయని అనుకున్నా వెంటనే చంద్రబాబునాయుడు పవన్ కు ప్యాకేజి ఇచ్చేసి బయటకు తీసుకొస్తున్న విషయం అందరికీ అర్ధమైపోయిందన్నారు. అందుకే జనసేనను అందరూ ‘చంద్రబాబునాయుడు భజన సేన’ అంటున్నారంటూ ఎద్దేవా  చేశారు. ‘చంద్రబాబుది తల్లి టిడిపి అయితే, జనసేనది పిల్ల టిడిపి అట’.

తప్పు చేసిన చంద్రబాబును కాపాడేందుకే పవన్ బయటకు వస్తున్నారు కానీ నిజంగా చంద్రబాబును నిలదీయటానికి మాత్రం రావటం లేదని స్పష్టం చేశారు. జగన్ గురించి మాట్లాడే అర్హత పవన్ కు లేదని తేల్చేసారు. జగన్, అనుభవం గురించి మాట్లాడుతున్న పవన్ లోకేష్ కు ఏమి అనుభవం ఉందని మంత్రయ్యారని నిలదీసారు. పిల్లనిచ్చి చేరదీసిన ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రైన చంద్రబాబులో ఏమి అనుభవం కనిపించింది పవన్ కు అంటూ ధ్వజమెత్తారు. వైసిపి పెట్టకముందే జగన్ ఎంపిగా గెలిచిన విషయం పవన్ కు తెలీదా? అంటూ ప్రశ్నించారు. ఏం అనుభవంతో చిరంజీవి, పవన్ పిఆర్పీని పెట్టారంటూ మండిపడ్డారు. చంద్రబాబు రాసిచ్చిన స్ర్కిప్ట్ మాట్లాడటానికి తప్ప పవన్ ఎందుకు పనికిరాడని రోజా తేల్చేసారు.