అమరావతి: గత ప్రభుత్వం చేసినట్లు మహిళలను టార్గెట్ చేయడం ప్రస్తుత ప్రభుత్వంలో ఉండదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా అన్నారు. అప్పుడు ప్రతిపక్ష శాసనసభ్యుల గొంతు నొక్కారని, మాట్లాడేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆమె విమర్శించారు. 

దేశం మొత్తం ఆదర్శంగా తీసుకునేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన ఉంటుందని  రోజా అన్నారు. రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని, నవరత్నాలను అర్హులందరికీ అమలు చేస్తామని ఆమె అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో అన్నారు. 

ప్రతి శాసనసభ్యుడు తన నియోజకవర్గ సమస్యలను సభలో చర్చించేలా అవకాశం ఉంటుందని రోజా చెప్పారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలన్నీ ప్రజలు కోరుకున్నవేనని అన్నారు. సామన్య ప్రజలు కూడా ప్రతిదీ తెలుసుకునేలా వైఎస్‌ జగన్‌ పారదర్శక పాలన అందించడం తమకు గర్వంగా ఉందని రోజా అన్నారు.