టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. లోకేష్ ను రోజా దద్దమ్మగా అభివర్ణించారు.
తిరుపతి: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మీద వైఎస్సాఆర్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యే రోజా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. లోకేష్ ను ఆమె దద్దమ్మగా అభివర్ణించారు. తిన్నది అరగక పనీ పాట లేకుండా లోకేష్ అవాకులు చవాకులు పేలుతున్నారని ఆమె అన్నారు.
ఆదివారం ఉదయం రోజా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా కూడా గెలువలేని దద్దమ్మ లోకేష్ అని ఆమె వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో రాష్ట్రంలో ఉండి ప్రజలకు భరోసా ఇవ్వకుండా తండ్రీకొడుకులు పక్క రాష్ట్రంలో దాక్కున్నారని ఆమె చంద్రబాబు, లోకేష్ లను ఉద్దేశించి అన్నారు.
అవినీతికి పాల్పడినవారిని అరెస్టు చేస్తే మాత్రం పరామర్శించేందుకు పరుగెత్తుకుని రాష్ట్రానికి వచ్చారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ అమలు చేశారని ఆమె ప్రశంసించారు. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో జగన్ ముందు చూపు ప్రదర్శించారని ఆమె అన్నారు.
ప్రజలకు ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తూ ఆరోగ్యశ్రీ కిందికి కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందిస్తూ దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలిచిందని ఆమె అన్నారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా సమర్థమైన పాలనను సాగిస్తూ వివిధ పథకాలతో జగన్ ప్రజలను ఆదుకుంటున్నారని ఆమె చెప్పారు.
