కృష్ణా జిల్లా తిరువూరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక బైపాస్ రోడ్‌లోని అయ్యప్పస్వామి గుడి వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ఆటోలో 12 మంది మహిళా కూలీలు వున్నట్లుగా తెలుస్తోంది.

వీరంతా తిరువూరు మండలం రాయగూడెం గ్రామనికి చెందినవారు. గంపలగూడెం మండలం,పెనుగొలనులో మిర్చి కోతకు వెళ్లివస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో కిలో మీటరు దూరం దాటితే తమ స్వగ్రామానికి చేరుకుంటారనగా ఈ విషాదం సంభవించింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ ఆసుపత్రికి తరలించారు. మరో 9 మంది కూలీలు తిరువూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.