చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రేణిగుంట-కడప రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. కడప జిల్లా సీకే దిన్నెకు చెందిన గంగాధరం కువైట్ నుంచి స్వదేశానికి చేరుకున్నారు.

ఆయనకు స్వాగతం పలికేందుకు కుటుంబసభ్యులంతా చెన్నై వెళ్లారు..గంగాధరాన్ని రీసివ్ చేసుకుని తిరిగి వారంతా కారులో కడప బయలుదేరారు. శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత రేణిగుంట-కడప రహదారిపై మామండూరు వద్ద ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో గంగాధరం, ఆయన భార్య విజయమ్మ, తమ్ముడు ప్రసన్న, ఆయన భార్య మరియమ్మ, వారి ఏడాదిన్నరి చిన్నారి అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.