పశ్చిమ గోదావరి జిల్లాలోని నేషనల్ హైవే నెంబర్ 16 పై ఆటో బోల్తా పడింది, ఈ ప్రమాదంలో 10 మందికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం వారంతా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వేగంగా వెళ్తున్న ఆటో కు ఒక్క సారిగా పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 

ప్ర‌యాణంలో ఉన్న ఆటో టైర్ కు ఒక్క సారిగా పంక్చ‌ర్ అయ్యింది. దీంతో ఆ ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆటోలో ప్ర‌యాణిస్తున్న 10 మందికి గాయాలు అయ్యాయి. వారంతా ప్ర‌స్తుతం హాస్పిట‌ల్ లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న ప‌శ్చిమ గోదావరి జిల్లాలోని భీమ‌డోలు మండ‌ల ప‌రిధిలోని సూర‌ప్ప‌గూడెం ప్రాంతంలో చోటు చేసుకుంది. 

ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. ద్వార‌కా తిరుమ‌ల (dwaraka tirumala) మండ‌ల ప‌రిధిలోని వెంక‌ట‌కృష్ణాపురం (venkata krishanpuram)గ్రామానికి చెందిన గెడ్డం ర‌వీంద్ర ప్ర‌సాద్ (geddam raveendra prasad) ఆటో న‌డ‌పుతుంటారు. అదే గ్రామానికి చెందిన ఓ ప‌ది మంది మ‌హిళ‌లు ఆటోను కిరాయి తీసుకొని శ్రీప‌ర్రుకు బ‌య‌లుదేరారు. అయితే ఆటో నేష‌న‌ల్ హైవే నెంబ‌ర్ 16 మీదుగా వెళ్తోంది. ఈ క్ర‌మంలో సూర‌ప్ప‌గూడెం వ‌ద్ద‌కు చేరుకోగానే ఆటో టైర్ ఒక్క సారిగా పంక్చ‌ర్ అయ్యింది. దీంతో వేగంగా ఉన్న ఆటో బోల్తా కొట్టింది. అందులో ఉన్న ప్ర‌యాణికులందరూ గాయాల‌పాల‌య్యారు. ఆటో స్వరూపం మారిపోయింది. ఈ ప్ర‌మాదం తెలుసుకున్న వెంట‌నే స్థానికులు అక్క‌డికి చేరుకున్నారు. 108 ఆంబులెన్స్ ల‌తో పాటు పెట్రోలింగ్ వెహికిల్స్ అక్క‌డికి చేరుకున్నాయి. వెంట‌నే వాటి ద్వారా క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స కోసం స్థానిక హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

నాగర్ కర్నూల్ (nagarkarnool) జిల్లాలో శుక్రవారం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.కల్వకుర్తి (kalwakurthi) మండలంలోని మార్చాల సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులను అరవింద్‌, శిరీష, కిరణ్మయిగా పోలీసులు గుర్తించారు. నల్గొండ (nalgonda) జిల్లా కొండమల్లెపల్లికి చెందిన అరవింద్, వర్ధిపట్లకు చెందిన శిరీష, ఖమ్మం జిల్లాకు చెందిన కిరణ్మయి, మిర్యాలగూడ‌కు చెందిన రేణుకలు.. హైదరాబాద్‌లో డిగ్రీ చదువుతున్నారు. వీరు హైదరాబాద్‌లోనే హాస్టల్స్‌లో ఉంటున్నారు. గురువారం వీరు నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దుండ మండలం బండోనిపల్లి గ్రామంలో ఫ్రెండ్ వివాహ విందుకు హాజరయ్యారు. వివాహ వేడుకలో పాల్గొన్న అనంతరం గురువారం రాత్రి హైదరాబాద్‌కు తిరిగి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మార్చాల వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. క్ష‌త‌గాత్రుల‌ను హాస్పిట‌ల్ కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉండ‌గా.. ఆదిలాబాద్ (adilabad) జిల్లాలోని భోర‌జ్ (bhoraj) చెక్ పోస్టు వ‌ద్ద జ‌రిగిన ప్రమాదంలో గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్ టీచ‌ర్ పద్మాజ రెడ్డి మృతి చెందారు. రోజులాగే ఆదిలాబాద్ ప‌ట్ట‌ణం నుంచి జైన‌థ్ మండ‌లంలో ఉన్న స్కూల్ కు బ‌య‌లుదేరింది. అయితే భోర‌జ్ ప్రాంతానికి చేరుకోగానే ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఆమె అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు. భోర‌జ్ ప్రాంతంలో మూడు రోజుల వ్య‌వ‌ధిలో ఇది మూడో ప్ర‌మాదం. గ‌త రెండు రోజులుగా అక్క‌డ రెండు ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఈ ప్ర‌మాదాల్లో ఇద్ద‌రు చ‌నిపోయారు. మూడు రోజుల వ్య‌వ‌ధిలో మూడు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డంతో స్థానికులు హైవే రోడ్డుపై కూర్చొని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.