కడప: ఆంధ్ర ప్రదేశ్ లో ఘోర రోడ్డుప్రమాదం  చోటుచేసుకుంది. కడప శివారులోని విమానాశ్రయం సమీపంలో జరిగిన ప్రమాదంలో లారీ, రెండు కార్లు ఢీకొన్నాయి.  ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనం కాగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.  

వివరాల్లోకి వెళితే... కడప నుంచి ఎర్రచందనం తీసుకుని వెళ్తున్న స్కార్పియో వాహనం ముందు వెళ్తున్న కారుని అధిగమించే క్రమంలో అదుపుతప్పి టిప్పర్​ని ఢీకొంది. స్కార్పియో వాహనం నేరుగా టిప్పర్​ డీజిల్​ ట్యాంకర్​ని ఢీకొనగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో స్కార్పియో వాహనంలోని నలుగురు సజీవ దహనం అయ్యారు. మరో కారులోని ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. వారిని రిమ్స్​కు  తరలించారు. 

ఈ ప్రమాదంలో రెండు కార్లు, ఒక టిప్పర్ పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పారు. స్కార్పియో తమిళనాడు నుంచి వస్తున్నట్లు సమాచారం. శవాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. పోలీసులు ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.