ఆత్రేయపురం: వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన దుర్ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కాలువనీటిలో ముగ్గురు గల్లంతవగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. మహాశివరాత్రి వేడుకల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 

వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరుకు చెందిన ముందిటి సురేష్‌ వర్మ(36), చింతలపాటి శ్రీనివాస్‌రాజు(46), ఇందుకూరి వెంకట సత్యనారాయణరాజు, ముదునూరి వెంకటగణపతిరాజు, మున్నింటి సీతారామరాజు ఒకే ప్రాంతంలో నివాసముంటారు. అయితే నిన్న(గురువారం) మహాశివరాత్రి పర్వదినం కావడంతో తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వసంతపాడులో వీరికి తెలిసిన వారింట వేడుకలు జరిగాయి. ఇందులో పాల్గొనేందుకు వీరు కారులో వచ్చారు. ఇవాళ తెల్లవారుజామున వీరు తిరుగుప్రయాణమయ్యారు. 

అయితే వీరు ప్రయాణిస్తున్న కారు  లొల్లాకుల మలుపు వద్దకు రాగానే అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. దీంతో కాలువ నీటిలో సురేష్‌ వర్మ, శ్రీనివాస్‌రాజు, వెంకట సత్యనారాయణరాజు గల్లంతయ్యారు. వెంకటగణపతిరాజు, సీతారామరాజు సురక్షితంగా బయటపడ్డారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు నీటిలో గల్లంతయిన వారికోసం గాలిస్తున్నారు. ఇప్పటికే రెండు మృతదేహాలు లభ్యమవగా ఇంకొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ ప్రమాదానికి డ్రైవింగ్ చేస్తున్నవ్యక్తి నిద్రమత్తు లేదా మంచు కారణమై వుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.