ఓ శుభకార్యం కోసం వెళ్లి తిరిగివస్తుండగా రోడ్డుప్రమాదం జరగడంతో ఆరుగురు మృత్యువాతపడ్డ విషాద సంఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. అప్పటివరకు పెళ్లివేడుకల్లో ఆనందంగా గడిపిన వారు రోడ్డు ప్రమాదంతో విగతజీవులుగా మారడంతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. 

వివరాల్లోకి  వెళితే... తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ఘాట్ రోడ్డులో  ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ ఘటన తెల్లవారుజామున 3గంటల సమయంలో జరిగింది. పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా పెళ్లి బృందం ప్రమాదానికి గురయ్యింది. 

ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితులంతా గోకవరం మండలంలోని వివిధ గ్రామాలకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు. 

మృతుల వివరాలు....

1.కంబాల భాను (గోకవరం)
2.సింహాద్రి ప్రసాద్ (ఠాకూర్ పాలెం)
3.ఎల్లా దివ్య శ్రీలక్ష్మి (దివాన్ చెరువు)
4.చాగంటి మోహిని (గాదారాడ)
5.పచ్చకూరి నరసింహ (గంగంపాలెం)

సంఘటన గురించి తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అలాగే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వాహనం బ్రేక్ ఫెయిల్ కావడంవల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.