మావోయిస్టు అగ్రనేత ఉనికిపై విచారణ ఆర్ కె బతికున్నారా అని నిలదీసిన న్యాయస్ధానం గురువారానికి విచారణ వాయిదా
మావోయిస్టుల ఎన్ కౌంటర్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి న్యాయస్ధానం కోర్టుకు చేరుకుంది. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ అలియాస్ ఆర్ కె ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఒకవైపు హక్కుల సంఘాల నేతలు, ఇంకోవైపు మావోయిస్టులు ఆరోపిస్తున్నారు.
ఆర్ కె తమ వద్ద లేనే లేరంటూ పోలీసు ఉన్నతాధికారులు మరోవైపు గట్టిగానే సమాధానం చెబుతున్నారు. దాంతో ఆర్ కె ఉనికిపై సర్వత్రా ఉత్కంఠ మొదలైంది.
దానికి తోడు ఆర్ కెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, కాబట్టి వెంటనే న్యాయస్ధానంలో హాజరుపరచాలంటూ హక్కుల సంఘాల నేతలు వరవరరావు, హరగోపాల్ తదితరులు ఎన్ కౌంటర్ జరిగిన రెండో రోజు నుండే గట్టిగా వాదిస్తున్నారు. ఆర్ కె విషయమై వారికి నిర్దిష్ట సమాచారం లేకపోతే వారంత గట్టిగా మాట్లాడరు. మరి నిజాలు దేవుడికే ఎరుక.
ఈ నేపధ్యంలో ఆర్ కె భార్య శిరీష కూడా తన భర్త ఉనికి విషయంలో పోలీసులనే తప్పు పడుతున్నారు. తన భర్త పోలీసుల ఆధీనంలో ఉన్నారని ఆరోపిస్తూనే ఆర్కెను న్యాయస్ధానంలో హాజరుపరచాలని డిమాండ్ చేస్తూ న్యాయస్ధానంలో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేసారు.
ఆ కేసునే నేడు హై కోర్టు విచారించింది. విచారణ సందర్భంగా ఆర్ కెను వెంటనే న్యాయస్ధానంలో పోలీసులు హాజరుపరచాలంటూ ఆదేశాలు జారీ చేయటం గమనార్హం.
అంతేకాకుండా, ఆర్కెకు ఎటువంటి హానీ జరగకూడదని, ఈ కేసును తాము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నట్లు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సాధారణ పౌరుడైనా, మావోయిస్టు అయినా మనిషేనని తమకు ఇద్దరూ సమానమేనని న్యాయస్ధానం తేల్చిచెప్పింది. ఎన్ కౌంటర్ పేరుతో మనుషులను చంపటం సరికాదని కూడా న్యాయస్ధానం అభిప్రాయపడింది.
అసలు ఆర్ కె చనిపోయారా లేక పోలీసుల కస్టడీలో ఉన్నారా అంటూ న్యాయస్ధానం ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. ఎన్ కౌంటర్ జరిగి ఇన్ని రోజులైతే వివరాలు తెలిపేందుకు ఎందుకు ఇన్ని రోజులు పడుతోందని సూటిగా పోలీసులను నిలదీసింది. ఆర్ కె ఎక్కడున్నారన్న విషయంలో వచ్చే గురువారం లోగా పిటీషన్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వాన్ని న్యాయస్ధానం ఆదేశించింది.
