తెలుగుదేశంపార్టీ కీలక నేతల్లో ఒకరు, రాజ్యసభ సభ్యుడైన సిఎం రమేష్ పై అన్ని వైపుల నుండి వ్యతిరేకత పెరిగిపోతోంది.

తెలుగుదేశంపార్టీ కీలక నేతల్లో ఒకరు, రాజ్యసభ సభ్యుడైన సిఎం రమేష్ పై అన్ని వైపుల నుండి వ్యతిరేకత పెరిగిపోతోంది. ‘ఒంట్టెత్తు పోకడలు’ అవలంభించటంతోనే రమేష్ పై ప్రభుత్వంతో పాటు పార్టీలోనూ ఏకకాలంలో వ్యతిరేకత పెరిగిపోతోంది. పార్టీలోని రాయలసీమ ప్రధానంగా కడప నేతలపై అధికారం చెలాయించటం, కాంట్రాక్టు తీసుకున్న ప్రజెక్టులు పూర్తి చేయకపోవటమే వ్యతిరేకత పెరగిపోవటానికి ప్రధాన కారణాలు.

 2014 ఎన్నికల్లో రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పార్టీ టిక్కెట్లు ఖరారు చేయటంలో కీలక పాత్ర పోషించారు. అప్పటి పార్టీ పరిస్ధితిని బట్టి చంద్రబాబునాయుడు కూడా సిఎం రమేష్ ను ప్రోత్సహించారు. దాని అవకాశంగా తీసుకున్న రమేష్ రెచ్చిపోయారు.

సిఎం అదృష్టం కొద్ది పార్టీ అధికారంలోకి రావటంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. రిత్విక్ ప్రాజెక్టుల పేరుతో ఇరిగేషన్ పనులు, రోడ్డు పనులతో పాటు ఇతరత్రా కాంట్రాక్టులు చేస్తుంటారు. 2014కు ముందు సంస్ధ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉండేది. ఎప్పుడైతే టిడిపి అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండి అందిన కాడికి కాంట్రాక్టులన్నింటినీ తీసుకుంటున్నారు. రాయలసీమ ప్రాంతంలోని చాలా ఇరిగేషన్ పనుల ప్రస్తుతం రమేషే చేస్తున్నారు.

అయితే, సమస్యల్లా ఇక్కడే మొదలైంది. కాంట్రాక్టులు దక్కించుకుంటున్న రమేష్ పనులు మాత్రం చేయటం లేదు. పనులు చేయకుండానే, అప్పటి అంచనా మొత్తాలను పెంచుకుంటూ పోతున్నారు. డబ్బులు తీసేసుకుంటున్నారు కానీ సబ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించటం లేదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో పనులు జరగటం లేదు. దాని ఫలితమే గండికోట ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరుపై చంద్రబాబు బహిరంగంగానే ఏ స్ధాయిలో మండిపడ్డారో అందరూ చూసారు.

గండికోట పనులే కాదు హంద్రీ-నీవా ప్రాజెక్టులో పది పనులు, గాలేరు-నగిరి ఫేజ్ 1, వంశధారా, గుత్తి-తాడిపత్రి నేషనల్ హైవే లాంటి పెద్ద పనులన్నీ ప్రభుత్వం రమేష్ సంస్ధలకే కట్టబెట్టింది. అంటే, పనులు చేసే సామర్ధ్యం లేకపోయినా అధికారంలో ఉన్నారు కాబట్టి అన్నీ పనులూ సిఎం రమేషే తీసుకుంటున్నారు. చేస్తున్న పనుల్లో కొన్నింటిని నేరుగా, మరికొన్నింటినీ ఇతర సంస్దలతో కలిసి చేస్తున్నారు. ఎలా చేసినా బిల్లులు మాత్రం తీసేసుకుంటున్నారు కానీ పనులే చేయటం లేదు. దాంతో ప్రభుత్వంలోనే కాకుండా పార్టీలో కూడా రమష్ అంటే వ్యతిరేకత పెరిగిపోతోంది.

ఇక, రాజకీయంగా కూడా కడప జిల్లాలో సమస్యలు మొదలైనట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి కి చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తుండటంతో రమేష్ పలుకుబడి తగ్గిపోతోంది. ఒకపుడు జిల్లా అంతటా తానే అని చెప్పుకుని తిరిగిన రమేష్ మాట ఇపుడు చాలా చోట్ల చెల్లుబాటు కావటం లేదట. ఏం చేస్తాం ‘ఓడలు బండ్లు..బండ్లు ఓడలు’ అవ్వటం అంటే ఇదేనేమో ?