సీఎం స్వలాభం కోసమే సిమెంట్ ధరలు పెంచారని టీడీపీ ఆరోపించింది. రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. 

భార‌తీ సిమెంట్స్ (bharathi cements)కు డ‌బ్బులు దోచి పెట్టేందుకే ధ‌ర‌ల‌ను పెంచేశార‌ని టీడీపీ (tdp) ఆరోప‌ణలు గుప్పించింది. ఈ మేర‌కు టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి (nallari kishor kumar reddy) ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. సినిమా టికెట్ల రేటు త‌గ్గించామ‌ని గొప్ప‌గా చెబుతున్న ప్ర‌భుత్వం.. నిర్మాణ రంగంలో ఉప‌యోగించే సిమెంటు ధ‌ర‌లు ఎందుకు త‌గ్గించ‌డం లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం నిర్మాణ రంగం చాలా వ‌ర‌కు దెబ్బ‌తింద‌ని ఆయ‌న చెప్పారు. అందుకే ఇప్పుడు నిర్మాణాలు అధిక సంఖ్య‌లో జ‌ర‌గ‌డం లేద‌ని అన్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో సిమెంట్ బ‌స్తా ధ‌ర ఒకేసారి రూ.60 చొప్పున పెంచ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. 

భార‌తీ సిమెంట్ ఒక్క దానిదే పెంచ‌కుండా.. దాని ఆధ్వ‌ర్యంలో అన్ని కంపెనీల ధ‌ర‌లు పెంచార‌ని ఆయ‌న న‌ల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. సీఎం కంపెనీ కోసమే ఇలా చేశార‌ని విమ‌ర్శించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి (cm jaganmohan reddy) అధికార దుర్వినియోగానికి పాల్ప‌డ్డార‌ని ఆయ‌న ఆరోపించారు. ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అధికారం చేప‌ట్టి.. జ‌గ‌న్ సీఎం అయ్యాక నిర్మాణ రంగంలో ఖ‌ర్చులు విప‌రీతంగా పెరిగిపోయాయ‌ని అన్నారు. సామాన్యుల‌కు ఇంటి నిర్మాణం భారంగా మారింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు ఇళ్లు క‌ట్టుకోవ‌డం పెను భారంగా త‌యారైంద‌ని అన్నారు. ఇళ్లు క‌ట్టుకునే వారంద‌రి జేబులు గుళ్ల అవుతున్నాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ఇప్ప‌టికైనా సిమెంట్ రేట్లు త‌గ్గించాల‌ని డిమాండ్ చేశారు. 

భారతి సిమెంట్ కు ఏపీ సీఎం బ్రాండ్ అంబాసిడ‌ర్ గా మారార‌ని న‌ల్లారి కిశోర్ కుమార్ ఆరోపించారు. సాక్షి దిన‌ప‌త్రిక‌కు అడ్వ‌ర్టైజ్ మెంట్స్, భార‌తి సిమెంట్స్ కు కాంట్రాక్ట్స్ ఇచ్చార‌ని, ఇవి త‌ప్ప గ‌డిచిన మూడేళ్ల‌లో ఏపీ ప్ర‌భుత్వం ఎలాంటి ప్ర‌గ‌తి సాధించలేద‌ని అన్నారు. జ‌గ‌న్ రెడ్డి ప్ర‌భుత్వ హ‌యాంలో పెరిగిన ధ‌ర‌ల వ‌ల్ల మ‌ధ్య‌త‌ర‌గ‌తి జీవులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని విమ‌ర్శించారు. ఇసుక మ‌ఫియా వ‌ల్ల నిర్మాణ రంగం ప‌డిపోయింద‌ని తెలిపారు. ల‌క్ష‌ల మంది భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు ఉపాధి క‌రువైంద‌ని అన్నారు. టీడీపీ హ‌యాంలో సిమెంట్ ధ‌ర‌లు పెరిగితే కేబినేట్ స‌బ్ క‌మిటీ ను ఏర్పాటు చేసి వాటిని త‌గ్గించామ‌ని తెలిపారు. కానీ ప్ర‌స్తుత ప్ర‌భుత్వం అలాంటి చ‌ర్య‌లేమీ తీసుకోవ‌డం లేద‌ని ఆరోపించారు. 

ఇసుక ధ‌ర‌ల‌ను అడ్డుగోలుగా పెంచేశార‌ని కిశోర్ కుమార్ అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఉన్న ఇసుక‌ను ప‌క్క రాష్ట్రాల‌కు తీసుకెళ్తూ సొమ్ము చేసుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. క్వాలిటీ లేని మ‌ద్యం తీసుకొచ్చి వాటి ధ‌ర‌ల‌ను కూడా అమాంత పెంచార‌ని అన్నారు. ఏపీలో నిత్య‌వ‌స‌రాలు పెరిగి ప్ర‌జ‌లు ఇబ్బందులు పడుతున్నా.. సీఎం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని తెలిపారు. విద్యుత్ ఛార్జీలు, బ‌స్ ఛార్జీలు పెంచార‌ని విమ‌ర్శించారు. దీంతో ప్ర‌జ‌ల జేబులు ఖాళీ అవుతున్నాయ‌ని చెప్పారు. త‌క్ష‌ణ‌మే అన్ని ధ‌ర‌ల‌ను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.