ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ వ్యూహం అనే సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. దీనిమీద టీడీపీ నేత దేవినేని ఉమాకు వర్మకు మధ్య ట్విట్టర్ వార్ మొదలయ్యింది.
టాలీవుడ్ వివాదాస్పద సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ… టిడిపి సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా మధ్య ట్విట్టర్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘వ్యూహం’ ఇది వైసిపి కోసం ఆర్జీవి తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విజయవాడలో జరుగుతుంది. దీనిమీద దేవినేని ఉమ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం దగ్గర ‘వ్యూహం’ సినిమా షూటింగ్ జరుగుతుంది.
అక్కడ షూటింగ్ జరపడంపై దేవినేని ఉమా అభ్యంతరం తెలుపుతూ… రాంగోపాల్ వర్మకి దమ్ముంటే టిడిపి హయాంలో నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద సినిమా తీయాలని సవాల్ చేశారు. ‘ఆర్జీవి దుర్మార్గుడు, ఓ దగుల్బాజీ.. ఆర్జీవికి బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా’ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ నాయకులు పట్టిసీమ దండగ అంటూ ప్రచారం చేశారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని దానివైపు చూస్తున్నారని దేవినేని వైఎస్ఆర్సిపిని ప్రశ్నించారు.
లోకేష్ సభలో వైసిపి రెబల్ ఎమ్మెల్యే ... వేదికపైనే కన్నీరు పెట్టుకున్న శ్రీదేవి
ఉమామహేశ్వర రావు చేసిన ఈ ఆరోపణలపై రాంగోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆర్జీవి ట్వీట్ చేస్తే ఎలా ఉంటుందో.. అలాగే ఉంది ఈట్వీట్ కూడా. మిక్కీమౌస్ తో ఉన్న తన ఫోటోను షేర్ చేస్తూ… దానికి దేవినేని ఉమాను ‘ఉమా..మ్…’ అంటూ ట్యాగ్ చేసి ట్రీట్ చేస్తూ.. చివర్లో ఓ కిస్ ఎమోజిని వదిలాడు. ఆర్జీవి స్టైల్ లో రెచ్చగొట్టేలా ఉన్న ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ఈ ట్వీట్ చూసిన వందలాది మంది అభిమానులు రియాక్ట్ అవుతున్నారు. ఇక దేవినేని ఉమా వీరాభిమానులు, టిడిపి కార్యకర్తలు అయితే వర్మపై తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో దేవినేని ఉమా కూడా మరోసారి ట్విట్టర్ కు పని చెప్పారు. దేవినేని ఉమ మరింత ముందుకు వెళ్లి.. బురదలో ఉన్న పందిబొమ్మను షేర్ చేస్తూ దాన్ని ఆర్జీవి అంటూ పోస్ట్ చేశారు.
దీనికి ఉమా కూడా ‘హాయ్ రాంగోపాల్ కర్మయ’ అంటూ పోస్ట్ చేశారు. ఆర్జీవి టిడిపి నాయకులపై ఇలా ట్వీట్లతో దాడి చేయడం ఇది కొత్తేమీ కాదు. మొన్నటి వరకు ఉత్తరాంధ్రకు చెందిన బండారు సత్యనారాయణపై ఇలాగే విమర్శలు గుప్పిస్తూ వరుస ట్వీట్లు చేశారు. దీనికి టిడిపి వర్గీయుల నుంచి దిమ్మతిరిగే కౌంటర్ వచ్చింది. తాజాగా ఉమా గురించి మాట్లాడి మళ్ళీ కౌంటర్లు ఎదుర్కొంటున్నాడు.
దీంతో ఏపీ రాజకీయాల్లో, టాలీవుడ్ లోనూ రామ్ గోపాల్ వర్మ, టిడిపి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. కాగా, ఆర్జీవి ఏపీ అసెంబ్లీ ఎన్నికల టార్గెట్గా వ్యూహం అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ట్యాగ్ లైన్ గా.. ‘కుట్రలకి, ఆలోచనలకు మధ్య..’ అని పెట్టాడు. ఈ సినిమాలో ‘వైయస్ఆర్ మరణం తర్వాత ఎవరు, ఎలాంటి వ్యూహాలు వేశారో.. పరిణామాలు ఎలా ఉన్నాయో ఇందులో చెబుతాం. వైయస్సార్ తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉంటుంది.
భారతిరెడ్డిని నేను దగ్గరి నుంచి చూసా, సినిమాలో జగన్ తో పాటు భారతి పాత్ర కూడా ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ వ్యూ లోనే వ్యూహం సినిమా ఉంటుంది ఎవరేం సినిమాలు తీసిన నాకు అనవసరం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజకీయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. అక్కడ జరుగుతున్న ప్రధాన ఘట్టాలన్నీ కూడా ఈ వ్యూహం సినిమాలో ఉంటాయి. నేను జగన్ అభిమానినే. అలాగని నాకు ఎవరి మీద ద్వేషం లేదు. సినిమా వెనక దాసరి కిరణ్ ఉన్నాడు.
అతను తప్ప ఇంకా ఎవరూ లేరు. జగన్ మీద నాకున్న అభిప్రాయాన్ని మాత్రమే సినిమాగా చెబుతున్నా. సినిమా తీయమని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పిలిచి అడిగినా నేను దర్శకత్వం చేయను. అడిగినంత ఇచ్చే వాళ్ళు ఉంటే హీరోలు రెమ్యునరేషన్ తీసుకోవడంలో తప్పులేదు. నిర్మాతలు ఇచ్చేముందు ఎవరికి ఎంత మార్కెట్ ఉంది అనేది చూసుకుంటారు’ అని చెప్పుకొచ్చారు.
