తన నియోజకవర్గం తాడికొండలో సాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వైసిపి రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పాల్గొన్నారు.
అమరావతి : వైసిపి రెబల్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టిడిపిలో చేరడం ఇక లాంచనంగానే కనిపిస్తోంది. పల్నాడు జిల్లా తాడికొండలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీదేవి టిడిపిలో చేరికపై క్లారిటీ ఇచ్చేసారు. రాజధాని అమరావతికి తాను పూర్తి మద్దతు ఇస్తున్నానని... ఒక దశలో రైతులకు మోసం చేసానంటూ లోకేష్ ముందు శ్రీదేవి కంటతడి పెట్టుకున్నారు.
తాడికొండ నియోజకవర్గం రావెలలో 'అమరావతి ఆక్రందన' పేరిట లోకేష్ రైతులతో ముఖాముఖీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొని అమరావతి రైతులకు బహిరంగ క్షమాపణలు చేప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన కోనసాగుతుందంటూ జగన్ సర్కారుపై ఎమ్మెల్యే గుప్పించారు. 'మూడు రాజధానులు వద్దు...అమరావతి ముద్దు' అని శ్రీదేవి నినదించారు.
వైసిపిలో వుండగా మూడు రాజధానులకు మద్దతుగా మీడియా సమావేశాలు పెట్టాలని ఒత్తిడితెచ్చినా తాను ఆ పని చేయలేదని అన్నారు. వైసిపి పాలనలో అమరావతి ప్రజలకు అన్యాయం జరిగి ఇబ్బంది పడుతుంటే ఏం చేయలేక మనోవేదనకు గురయ్యాయని... ఇక్కడ ప్రజల బాధలు చూసి రోజూ ఏడ్చేదాన్ని అని అన్నారు. వైసిపి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నందున అమరావతి ఉద్యమంలో ముందుకు రాలేకపోయానని... ఆ పార్టీలోంచి ఎప్పుడెప్పుడు భయటకు వద్దామా అని ఎదురుచూసేదాన్ని అని అన్నారు. ఇప్పుడు ప్రాణం పోయినా రాజధాని అమరావతి కోసం పోరాటం ఆపనని ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేసారు.
Read More ఆర్జీవీకి దేవినేని ఉమా సవాల్.. దమ్ముంటే ఆ సినిమా తీయ్
అమరావతి రాజధాని దేవతల రాజధాని... అమరేంద్రుడు పరిపాలన చేసిన ప్రాంతం ఇది అని శ్రీదేవి తెలిపారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ పరిపాలన బాగుంటుంది... కానీ ఇక్కడ స్త్రీలను అవమానింపబడుతున్నారని అన్నారు. అందువల్లే ఇక్కడ రాక్షస పాలన సాగుతోందని అన్నారు. మళ్లీ ప్రజలకు సుపరిపాలన అందాలంటే వచ్చే ఎన్నికల్లో ఓటునే ఆయుధంగా మార్చుకుని వైసిపిని చిత్తుచిత్తుగా ఓడించాలని... చంద్రబాబును సీఎంగా గెలిపించాలని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.
గత ఎన్నికల సమయంలో అమరావతి రాజధాని పేరుతో ఓట్లు వేయించుకుని గెలిచాను... కానీ గెలిపించిన ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చూసి చాలా బాధపడ్డానని అన్నారు. ప్రజలను బాధపెట్టిన ఏ పార్టీ ఎక్కువకాలం అధికారంలో వుండలేదు... అలాగే వైసిపి ప్రభుత్వం కూడా త్వరలోనే గద్దెదిగడం ఖాయమన్నారు. అమరావతి నుండే వైసిపి పతనం మొదలయ్యిందని శ్రీదేవి అన్నారు.
