అమరావతి: అక్టోబర్ 2 నుంచి గ్రామసచివాలయాలు అమలులోకి రానున్నట్లు ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో త్వరలో ఏర్పాటు కానున్న గ్రామ, వార్డు సచివాలయాలపై సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మున్సిపల్ శాఖమంత్రి బొత్స సత్యనారాయణ, పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితోపాటు పలువురు అధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా గ్రామ సచివాలయ పరీక్షలను విజయవంతం నిర్వహించినందుకు అధికారులకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే నాలుగు లక్షలకు పైగా నియామకాలు చేపట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. 

ప్రజాసమస్యలపై స్పందనకు గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రత్యేక నంబర్ ఉండాలని జగన్ ఆదేశించారు. ఫిర్యాదుల కోసం 1902 టోల్ ఫ్రీ కాల్ సెంటర్ ను సిద్ధం చేసినట్లు అధికారులు జగన్ కు స్పష్టం చేశారు. 

ప్రతీ గ్రామవార్డు సచివాలయాల్లో డేటా సెంటర్ ఉండాల్సిన అవసరం ఉందని జగన్ సూచించారు. ప్రజల సమాచారాన్ని ఆ డేటా సెంటర్లో నిక్షిప్తం చేయాలని చెప్పారు. గ్రామ సచివాలయానికి రాష్ట్ర సచివాలయానికి అనుసంధాన విధానం ఉండాలని అధికారులకు స్పష్టం చేశారు. 

రైతుభరోసా పథకానికి ఏర్పాట్లు వేగవంతం చేయండి

వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా పథకానికి ఏర్పాట్లు పూర్తి చేయాలని జగన్ ఆదేశించారు. అక్టోబర్ 15న పథకం అమలు కానున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. 

ప్రకృతి, సేంద్రియ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. సచివాలయాల ద్వారా ప్రజలకు 237 రకాల సేవలు అందించనున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేశారు. మరోవైపు నూతనంగా దరఖాస్తు చేసుకున్న పింఛన్ దారులకు డిసెంబర్ నుంచి పింఛన్ అందజేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 

పారదర్శక పద్ధతిలో పథకాన్నిఅమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. వేలిముద్రలు సరిగ్గా పడకపోతే వీడియో స్క్రీనింగ్‌ ద్వారా వెంటనే పథకాన్ని అందించాలని సూచించారు. అంతే తప్ప సాంకేతిక కారణాలు చూపి ఏ పథకాన్ని కూడా నిరాకరించరాదని తెలిపారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ప్రభుత్వంపై రాళ్లేస్తుంది అందుకే: సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు