విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలో మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ కంపెనీకి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేశారు. 

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామ పరిధిలో మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ కంపెనీకి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీచేశారు. సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ కంపెనీ ప్రభుత్వ భూమిని అక్రమించించడంతో నోటీసులు జారీ చేసినట్టుగా రెవెన్యూ వర్గాలు తెలిపాయి. నోటీసులు జారీ చేయడంతో పాటు కంపెనీ అక్రమించిన రహదారిని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. అయితే రెవెన్యూ అధికారులను మిరాకల్ కంపెనీ యాజమాన్యం అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో ముంజేరు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇక, ముంజేరు గ్రామంలో లోకం ప్రసాద్ మిరాకల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. లోకం ప్రసాద్ భార్య మాధవి జనసేన పార్టీ నాయకురాలుగా ఉన్నారు. అయితే కంపెనీ సమీపంలోని ప్రభుత్వ  భూములను ప్రసాద్‌ అక్రమించారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. గ్రామంలో ప్రభుత్వ భూమి అక్రమణలను గుర్తించామని.. ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకుని తీరుతామని స్పష్టం చేస్తున్నారు.  

అయితే రెవెన్యూ అధికారుల వాదనలను  మిరాకల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్స్ యాజామాన్యం ఖండిస్తోంది. తమ కంపెనీ పరిధిలో ప్రభుత్వ భూములు ఉన్నాయని అధికారులు నిత్యం దాడులు చేస్తున్నారని  లోకం ప్రసాద్ ఆరోపించారు. కనీసం షోకాజ్ నోటీసు అయిన ఇవ్వకుండా ఇలా చేయడం దారుణం అని అన్నారు. కంపెనీలో పనిచేస్తున్నవారిని భయాందోళనకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఇండస్ట్రీలను తరిమికొట్టడం ఈ ప్రభుత్వానికి అలవాటు అయిపోందని విమర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించి నిర్వాసితుల తరపున పోరాడుతున్న తమపై వైసీపీ నాయకులు, అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.