కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ మట్టి తవ్వకాల్ని అడ్డుకున్న ఆర్ఐ మీద మట్టి మాఫియా దాడికి తెగబడింది. దీనిమీద రెవెన్యూ సంఘాలు నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. 

కృష్ణా : కృష్ణా జిల్లాలోని గుడివాడ మండలం మోటూరులో గురువారం రాత్రి ఆర్ఐపై దాడి జరిగింది. అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐ అరవింద్ మీద మట్టి మాఫియా దాడికి దిగింది. కొన్ని రోజులుగా రాత్రివేళ అధికార పార్టీ నేతలు మట్టి తవ్వుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. దీంతో అడ్డుకుంటున్న అధికారులను మట్టి మాఫియా బెదిరిస్తోంది. ఈ క్రమంలో ఆర్ఐ అరవింద్ మీద దాడి జరిగింది. ఈ ఘటనపై రెవెన్యూ సంఘాలు స్పందించాయి. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. 

ఇదిలా ఉండగా, ఏప్రిల్ 19న హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి.పాతబస్తీలోని కుల్సుంపురాలో స్థానిక కరెంట్ ఆఫీస్‌పై యువకులు దాడికి దిగారు. విధినిర్వహణలో భాగంగా పెండింగ్ బిల్లుల వసూలుకు విద్యుత్ ఉద్యోగులు ఆ ప్రాంతంలోకి వెళ్లారు. వారి తనిఖీల నేపథ్యంలో దొంగతనంగా విద్యుత్ వాడుతున్న వారిని అధికారులు గుర్తించారు. దానిమీద ప్రశ్నించారు. అంతేకాదు పెండింగ్ బిల్లులు చెల్లించాలని అధికారులు హెచ్చరించారు. దీంతో యువకులు రెచ్చిపోయారు. కరెంట్ ఆఫీసు మీదికి వచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగుల మీదికి దూసుకొచ్చారు. వారిని చితకబాదారు. మొత్తం నలుగురు యువకులు కార్యాలయంలో హంగామా సృష్టించారు. 

కాగా, ఏప్రిల్ 17న ర్ణాటకలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ముస్లింలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ఓ వ్యక్తి పోస్టు చేశాడు. దానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఫిర్యాదు వచ్చింది. ఈఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. సదరు వ్యక్తిని అరెస్టు చేశారు. పోలీసులు తీసుకున్న చర్యలతో సంతృప్తి పొందని ఫిర్యాదు చేసిన వర్గం పోలీసు స్టేషన్ ఎదుట గుమిగూడింది. రాళ్లతో విరుచుకుపడింది.

ఈ రాళ్ల దాడిలో కనీసం 12 మంది పోలీసులు గాయపడ్డారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసు స్టేషన్‌పై రాళ్లు రువ్వగానే పోలీసులూ అప్రమత్తం అయ్యారు. వెంటనే బయటకు వచ్చి స్వల్పంగా లాఠీ చార్జ్ చేశారు. గుంపును చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. పోలీసు స్టేషన్‌పై దాడులకు సంబంధించి ఆరు కేసులు నమోదు చేసినట్టు హుబ్లీ ధార్వాడ్ పోలీసు కమిషనర్ లాభు రామ్ వెల్లడించారు. 

ఈ కేసుల్లో 46మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ప్రస్తుతం పరిస్తితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు. దాడికి ముందు రోజు రాత్రి పెద్ద మొత్తంలో పోలీసు స్టేషన్ ఎదుట గుమిగూడారని వివరించారు. ఆ తరువాత దాడులకు దిగారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తాము అన్ని చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.ఈ ఘటనపై కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సీరియస్ అయ్యారు. ఇలాంటి ఘటనలను సహించబోమని వార్నింగ్ ఇచ్చారు. 

ఎవరైనా సరే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునేవారిమీద కఠినచర్యలు తీసుకోవడానికి తమ పోలీసులు వెనుకాడబోరని స్పష్టంగా చెప్పదలిచానని పేర్కొన్నారు. వారు ఎవరైనా సరే.. ఈ మూకను రెచ్చగొట్టి పోలీసు స్టేషన్‌పై దాడికి ఉసిగొల్పిన సంస్థలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇలాంటి అల్లర్ల వెనుక ఉండే సంస్థలపై చర్యలు తప్పవని తాను స్పష్టంగా చెప్పదలిచినట్టు వివరించారు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని హెచ్చరించారు. కర్ణాటక ప్రభుత్వం ఇలాంటి చర్యలను ఉపేక్షించదని అన్నారు.