స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మాచర్లలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బొండా ఉమామహేశ్వర రావు ప్రయాణిస్తున్న కారుపై దుండగులు బుధవారంనాడు దాడి చేశారు. 

వైసీపీ కార్యకర్తలు తమపై దాడి చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము దాడి నుంచి తప్పించుకుని తెలంగాణలోని నల్లగొండ జిల్లాకు వెళ్లామని చెబుతున్నారు. తమకు ఏపీలో రక్షణ లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. కారుపై ఓ వ్యక్తి పెద్ద కర్రతో దాడి చేయడం టీవీ చానెళ్లు ప్రసారం చేసిన దృశ్యాల్లో స్పష్టంగా కనిపించింది. 

Also read: మేం పిల్లాడిని ఢీకొట్టామా.. ఏది జగన్‌పై ప్రమాణం చేయ్: పిన్నెల్లికి బుద్ధా వెంకన్న సవాల్

ఇక ఇలా టీడీపీ వారు వైసీపీ గుండాల హత్యాయత్నం అని ఆరోపిస్తుండడంతో వెంటనే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి టీడీపీ నేతల కారు ఒక వికలాంగుడిని గుద్ది వచ్చిందని. అక్కడ ఆగకుండా తప్పించుకుపోతుంటే... మాచర్ల స్థానికులు వారిపై దాడికి దిగారని ఆయన ఆరోపించారు. 

ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు కొద్దిసేపు అటుంచి... గతంలో కొన్ని రోజుల కింద రాజధాని ప్రాంతంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుకు తెచ్చుకుంటే ఒక ఆశ్చర్యకరమయిన పోలిక కనబడడంతోపాటుగా రివెంజ్ పాలిటిక్స్ ఆ అనే అనుమానం మాత్రం కలుగక మానదు. 

కొన్ని రోజులకింద మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి రాజధాని ప్రాంతం నుండి వెళుతుండగా అమరావతి పరిసర ప్రాంత రైతులు ఆయన కాన్వాయ్ ని అడ్డగించి దాడి చేసారు. అప్పుడు ఆయన సెక్యూరిటీ సిబ్బందిపై కూడా పిడి గుద్దులు గుద్దారు. 

Also read: మా హత్యను లైవ్‌ స్ట్రీమింగ్‌లో చూడాలనుకున్నాడు: పిన్నెల్లిపై బొండా వ్యాఖ్యలు

ఆయన కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అప్పుడు అంతమంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ఆ దాడిని ఎవ్వరు ఆపలేకపోయారు. ఆయనపై ఆరోజు దాడి తీవ్రంగానే జరిగింది. 

ఇప్పుడు మాచర్ల ఊరిలో అది పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి ఎమ్మెల్యే గా ఉన్న ఊరిలో టీడీపీ రాజధాని ప్రాంత నేతలు పర్యటిస్తున్న వేళ ఇలా వారిపై దాడి జరగడం నిజంగా ఆశ్చర్యకరమైన అంశం. 

దాడి ఎందుకు జరిగిందో ఇప్పటి వరకు అధికారికంగా ధృవీకృతమవనప్పటికి దానిని పై పైన చూసిన ఎవరికైనా అది ఒక రకంగా రివెంజ్ దాడిగానే కనబడుతుంది. వాస్తవాలు వేరుగా ఉండొచ్చు. కానీ చూసేవారికి మాత్రం అలానే కనబడుతుంది. టీడీపీ వారు కూడా దీనికి ఆజ్యం పోసేలా మాట్లాడుతుండడం దానికి మరింతగా ఆ కలరింగ్ ఇస్తోంది. 

ఇక సోషల్ మీడియాలో అయితే విపరీతమైన చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో ఎవరికీ వారు ఇలా రివెంజ్ పాలిటిక్స్ అని మాట్లాడుతున్నారు. అక్కడ దీనికి సంబంధించి ఎన్నో మీమ్స్ కూడా షేర్ చేసేస్తున్నారు. 

మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కూడా తనపై అప్పుడు జరిగిన దాడిని ప్రస్తావించడాన్ని వారు ఇక్కడ ఉటంకిస్తూ... అప్పుడు అక్కడ దాడి జరిగింది కాబట్టే... ఇప్పుడు ఇక్కడ దాడి చేసారు అని చర్చించుకుంటున్నారు.