పొలిట్ బ్యూరో సమావేశంలో రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారట. శుక్రవారం టిడిపి పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. మూడు రోజులుగా తెలంగాణా రాజకీయాలైనా అటు ఏపి టిడిపి నేతల మధ్య అయినా రేవంత్ రెడ్డే కేంద్రబిందువైన సంగతి అందరికీ తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో టిడిపి-టిఆర్ఎస్ మధ్య పొత్తలుంటాయని జరుగుతున్న ప్రచారంతో రేవత్ కు చిర్రెత్తింది.

దాంతో తెలంగాణాలో టిడిపి, కాంగ్రెస్ లు పొత్తుపెట్టుకోవాలే గానీ టిఆర్ఎస్ తో ఏంటంటూ మండిపడుతున్నారు. ఆ సందర్భంగానే ఏపి టిడిపిలో కీలక నేతలైన యనమల రామకృష్ణుడు, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ కు కెసిఆర్ తో ఉన్న సంబంధాలను బయటపెట్టారు. దాంతో రెండు రాష్ట్రాల్లోనూ ఒక్కసారిగా కలకలం రేగింది. సరే, దాని తర్వాత పరిణామాలు అందరికీ తెలిసిందే.

ఆ నేపధ్యంలోనే ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో నారా లోకేష్ ఆధ్యక్షతన పొలిట్ బ్యూరో సమావేశమైంది. అదే సందర్భంగా రేవంత్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్ధాయిలోనే చర్చ జరిగింది. రేవంత్ ను తొలినుండి వ్యతిరేకిస్తున్న నేతలు కూడా పొలిట్ బ్యూరో లో సభ్యులే. అందుకే సమావేశం మొత్తం బాగా హాట్ గా జరిగింది.  రేవంత్ వ్యతిరేకులైన మోత్కుపల్లి, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులకు రేవంత్ తో పెద్ద వాగ్వాదమే జరిగిందట.

చంద్రబాబునాయుడు అభిమతానికి వ్యతిరేకంగా రేవంత్ వ్యవహరిస్తుండటంపైనే వీరిద్దరూ ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాచారం. పార్టీ అంతర్గత వ్యవహారాలను బహిరంగంగా ప్రస్తావించటంపై వీరిద్దరు రేవంత్ పై మండిపడినట్లు సమాచారం.

అందుకు రేవంత్ కూడా ధీటుగానే సమాధానమిచ్చారట. ఏపి టిడిపి నేతల్లో పలువురు కెసిఆర్ తో టచ్ లో ఉండటాన్ని రేవంత్ ప్రధానంగా ప్రస్తావించారట. తాను తెలంగాణాలో కెసిఆర్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే, ఏపి నేతలు అదే కెసిఆర్ కు ఒంగి ఒంగి సలాములు కొట్టటమేంటంటూ తీవ్రంగా మండిపడ్డారట.

ఏపి టిడిపి నేతల వైఖరి వల్లే తెలంగాణాలో టిడిపి దెబ్బతినటమే కాకుండా చివరకు మనుగడే ప్రశ్నార్ధకమవుతోందని రేవంత్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. తెలంగాణా నేతలకు తాను సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదని, ఏమైనా చెప్పుకోవాలంటే నేరుగా చంద్రబాబునాయుడుతోనే చెబుతానని స్పష్టం చేయటంతో మిగిలిన సభ్యులు ఏమీ మాట్లాలేకపోయారట. 26వ తేదీ చంద్రబాబు విదేశాల నుండి తిరిగి వచ్చే వరకూ రేవంత్ వ్యవహారం తేలేలా లేదు.