అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లా పెనుకొండ ప్లాంట్ కియా మోటార్స్ తరలించడానికి ఏర్పాట్లు చేసుకుంటుందనే వార్తాకథనంపై రాయిటర్స్ వెనక్కి తగ్గడం లేదు. తమ వార్తాకథనంపై రాయిటర్స్ స్పష్టీకరణ ఇచ్చింది. కియా మోటార్స్ తన ప్లాంట్ ను ఏపీ నుంచి తరలించడదానికి చర్చలు జరుగుతున్నాయనే తమ వార్తాకథనం వాస్తవమేనని సమర్థించుకుంది. 

రాయిటర్స్ గతంలో చేసిన ట్వీట్ కు సవరణతో మరో ట్వీట్ చేసింది.  కియా మోటార్ల తయారీ పరిశ్రమను ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడుకు తరలించదడానికి సంస్థ ప్రతినిధులు తమిళనాడు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఈ నెల 6వ తేదీన ప్రచురించిన వార్తకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. 

Also Read: అవన్నీ అవాస్తవాలే, ఫ్లాంట్ ఏపీలోనే ఉంటుంది: కియా మోటార్స్ ఎండీ

ఆ వార్త వెలువడిన వెంటనే అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు కియా సంస్థ కూడా ప్రకటించింది. అయితే, రాయిటర్స్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తాము రాసిన వార్తాకథనానికి కట్టుబడి ఉన్నట్లు రాయిటర్స్ ప్రకటించింది. 

1.1 బిలియన్ ప్లాంట్ ను ఆంధ్రప్రదేశ్ వెలుపలికి తరలించడదానికి కియా చర్చలు జరుపుతోంది అనే వార్తను ట్విట్టర్ హ్యాండిల్ లో శనివారం రాత్రి 10.59 గంటలకు మరోసారి పోస్ట్ చేసింది. దాంతో పాటు ఆ వార్తకు సంబంధించిన తాజా అప్ డేట్ ను రాత్రి 11.13 గంటలకు తన వెబ్ సైట్ లో పోస్టు చేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం కలిగించిన ఆ వార్తాకథనానికి సంబంధించి ఓ అసంబంద్ధమైన ట్వీట్ (ఇన్ కరెక్ట్) ను తొలగిస్తున్నట్లు శనివారం మధ్యాహ్నం 1.26 గంటలకు ట్విట్టర్ లో పోస్టు చేసింది. అది కొంత అయోమయానికి గురి చేసింది. అందులో వాడిన పదప్రయోగం కొంత అస్పష్టంగా ఉంది. దాంతో రాయిటర్స్ తన వార్తాకథనం తప్పు అని తెలుసుకుందని కొందరు వాదించడం ప్రారంభించారు. అందుకే డిలిట్ చేసినట్లు ప్రకటించిందని అన్నారు. 

Also Read: చంద్రబాబు భంగపడ్డారు: కియా మోటార్స్ తరలింపు వార్తపై గోరంట్ల మాధవ్

అయితే, వాస్తవం మాత్రం అందుకు భిన్నంగానే ఉంది. ఈ నెల 6, 8 తేదీల మధ్య రాయిటర్స్ మూడు ట్వీట్లు పెట్టింది. కియా మోటార్స్ తన ప్లాంట్ ను బయటకు తరలించడానికి చర్చలు జరుపుతున్నట్లు 6వ తేదీ ఉదయం 7 గంటలకు ట్వీట్ చేసింది. అదే రోజు రాత్రి 8.06 గంటలకు పోస్టు చేసిన మరో ట్వీట్ లో పొరపాటున ఆంధ్రప్రదేశ్ నుంచి బయటకు పోతుందని చెప్పడానికి మారుగా ఆంధ్రప్రదేశ్ కు పోతుందని అన్నారు. 

ఆ తప్పును తెలుసుకున్న రాయిటర్స్ 8వ తేదీ మధ్యాహ్నం 1.26 గంటల ప్రాంతంలో ఆ తప్పుడు ట్వీట్ ను డిలీట్ చేస్తున్నట్లు తెలిపింది. కియా  ఆంధ్రప్రదేశ్ వెలుపలికి వెళ్లడానికి చర్చలు జరుపుతోంది, ఆంధ్రప్రదేశ్ రావడానికి కాదని స్పష్టత ఇచ్చింది. తమ ట్వీట్ లో జరిగిన పొరపాటును గ్రహించి దాన్ని మాత్రమే తొలగించామని, కియా ప్లాంట్ తరలింపుపై ఇచ్చిన కథనానికి కట్టుబడి ఉన్నామని రాయిటర్స్ సంస్థ స్పష్టం చేసింది.