గుంటూరు తొక్కిసలాట: విచారణ ప్రారంభించిన రిటైర్డ్ జడ్జి శేషశయన రెడ్డి కమిషన్
గుంటూరు తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జి శేషశయన రెడ్డి కమిటీ ఇవాళ విచారణను ప్రారంభించింది. ఈ నెల 1వ తేదీన గుంటూరులో జరిగిన తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు.
గుంటూరు: ఈ నెల 1వ తేదీన గుంటూరులో జరిగిన తొక్కిసలాట ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ గురువారం నాడు విచారణను ప్రారంభించింది. ఈ తొక్కిసలాట ఘటనపై రిటైర్డ్ జడ్జి శేషశయన రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ తొక్కిసలాట విషయమై తొలుత గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో రిటైర్డ్ జడ్జి సమావేశమయ్యారు. తొక్కిసలాట ఘటనపై సమాచారం సేకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్, ఎస్పీ లతో సమావేశం ముగిసిన తర్వాత తొక్కిసలాట జరిగిన గ్రౌండ్ ను రిటైర్డ్ జడ్జి శేషశయన రెడ్డి పరిశీలించారు .
ఈ గ్రౌండ్ లో ఎంత మంది వస్తారని అనుమతి తీసుకున్నారు. ఎంత మందిని తీసుకు వచ్చారో రిటైర్డ్ జడ్జి అడిగి తెలుసుకున్నారు. ఈ గ్రౌండ్ ను ఏ కారణంతో అనుమతి తీసుకున్నారో కూడా విచారణ కమిటీ చైర్మెన్ ఆరా తీశారు. గ్రౌండ్ లో ఏ స్థలంలో స్టేజీ ఏర్పాటు చేశారు. బారికేడ్లు ఎందుకు కూలిపోయాయనే విషయమై కూడా రిటైర్డ్ జడ్జి సమాచారం సేకరించారు. గ్రౌండ్ విస్తీర్ణాన్ని కూడ విచారణ కమిటీ కొలతలు తీసుకుంది. ఈ గ్రౌండ్ లో సభ నిర్వహించిన నిర్వాహకుల నుండి కూడా సమాచారం సేకరించారు.
ఈ నెల 1వ తేదీన గుంటూరులో ఎన్ఆర్ఐ ఉయ్యూరు శ్రీనివాస్ తన పౌండేషన్ ద్వారా సంక్రాంతి కిట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చంద్రబాబు వెళ్లిపోయిన తర్వాత కిట్స్ కోసం ఒక్కసారిగా జనం రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. మరో 18 మంది గాయపడ్డారు. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరులో చంద్రబాబు రోడ్ షో లో కూడా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఎనిమిది మంది మృతి చెందారు.
గుంటూరు, కందుకూరు తొక్కిసలాటల నేపథ్యంలో జీవో నెంబర్ 1ని ఈ నెల రెండో తేదీన తీసుకువచ్చింది ఏపీ ప్రభుత్వం. రోడ్లపై ర్యాలీలు, సభలు, రోడ్ షోలను నిషేధిస్తూ ఈ జీవో తెచ్చింది. ఈ జీవో ను సవాల్ చేస్తూ సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో నెంబర్ 1ని ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిగే అవకాశం ఉంది.