పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రిటైర్ట్ ఐఏఎస్ .. ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ
రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ‘‘ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ’’ పురుడు పోసుకుంది. విజయ్ కుమార్ పలు కీలక హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్తారని అప్పట్లో ప్రచారం జరిగింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్దినెలల్లో జరగనున్న సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ , జనసేన, బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఎస్పీలకు తోడు చిన్నా చితకా పార్టీలు బరిలో నిలవనున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్ధుల ఎంపికలో తలమునకలై వున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పార్టీ ఏర్పాటైంది. బుధవారం గుంటూరు బైబిల్ మిషన్ గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభల ఏర్పాటు చేసిన విజయ్ కుమార్ ‘‘ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ’’ పేరును ప్రకటించారు.
ఈ సందర్భంగా తాను రాజకీయాల్లోకి వచ్చిన కారణాలను వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని .. పార్టీ గుర్తు కోసం ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకుంటామని విజయ్ కుమార్ పేర్కొన్నారు. తమతో కలిసి వచ్చే నాయకులు, పార్టీలతో కలిసి ముందుకు సాగుతామని ఆయన పొత్తులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కాగా.. ఐఏఎస్ విజయ్ కుమార్ పలు కీలక హోదాల్లో పనిచేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే చివరికి విజయ్ కుమార్ సొంత పార్టీ పెట్టడం గమనార్హం. కొద్దిరోజుల క్రితం ఐక్యత విజయపథం పేరుతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాదయాత్ర సైతం చేశారు. దళిత, గిరిజనులతోనూ విజయ్ కుమార్ సమావేశమయ్యారు.
ఇకపోతే.. విశ్రాంత ఐపీఎస్ , సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కొత్త పార్టీని ప్రకటించారు. ‘‘జై భారత్ నేషనల్ పార్టీ’’ పేరుతో ఆయన ఎన్నికల బరిలో దిగనున్నారు. ఈ మేరకు పార్టీ జెండాను జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. సమస్యలు పరిష్కారం కావాలంటే రాజ్యాధికారం కావాలని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పారని గుర్తుచేశారు. వివిధ వర్గాల ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశ్యంతో పార్టీని పెడుతున్నామని, మా పార్టీ ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ అని జేడీ లక్ష్మీనారాయణ అభివర్ణించారు. రాష్ట్రంలో నిరుద్యోగం ప్రధాన సమస్యఅని.. ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదన్నారు.