‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి శుక్రవారం తెల్లవారుజామున ఇల్లు వదలి వెళ్లిపోయారు. 

మాజీ జడ్జీ ఆత్మహత్య చేసుకోగా.. అది తెలసి తట్టుకోలేక ఆయన భార్య కూడా ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ఏపీలోని తిరుపతిలో చోటుచేసుకుంది. రైల్వే సీఐ ఆశీర్వాదం కథనం మేరకు.. పామూరు సుధాకర్‌ (63), భార్య వరలక్ష్మి (56) తిరుచానూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. సుధాకర్‌ అదనపు జిల్లా జడ్జిగా మహబూబ్‌నగర్‌లో పనిచేస్తూ 2014లో రిటైరయ్యారు. వీరికి సందీప్, అజిత అనే ఇద్దరు పిల్లలు వున్నారు. వీరివురికి వివాహమైంది.

సుధాకర్‌ గత కొంతకాలంగా కాళ్లు.. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. దీంతో తీవ్ర మనోవేదన చెందిన ఆయన.. ‘నా చావుకు ఎవరూ కారణం కాదు’ అని సూసైడ్‌ నోట్‌ రాసి శుక్రవారం తెల్లవారుజామున ఇల్లు వదలి వెళ్లిపోయారు. ఉదయం 11 గంటల సమయంలో చదలవాడ విద్యాసంస్థల సమీపంలోని రైల్వే ట్రాక్‌పై రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటనా స్థలం చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కుటుంబీలకు సమాచారమిచ్చారు. కుమారుడు సందీప్‌ ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు.

మరోవైపు.. భర్త ఆత్మహత్యతో తీవ్ర మనస్తాపానికి గురైన వరలక్ష్మీ.. కుటుంబ సభ్యుల దృష్టి మళ్లించి సాయంత్రం అదే ప్రదేశంలో ఆమె కూడా రైలుకింద పడి తనుకు చాలించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఆమెను సుధాకర్‌ భార్యగా గుర్తించారు. మరణంలోనూ భర్త అడుగుజాడల్లో ఆమె నడవడం బంధుమిత్రులు, చుట్టుపక్కల వారిని కంటనీరు పెట్టించింది. 

కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కాలేజీకి తరలించారు. ఇదిలా ఉంటే.. సుధాకర్‌ ఓ ప్రైవేట్‌ చిట్స్‌ కంపెనీలో కేసుల పరిష్కారానికి ఆర్బిట్రేటర్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన తిరుపతిలో సీనియర్‌ సివిల్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. సుధాకర్‌ దంపతుల మృతికి తిరుపతి న్యాయవాదుల సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వి. శ్రీనివాసులు, పలువురు న్యాయవాదులు సంతాపం వ్యక్తంచేశారు