కర్నూలు: అప్పుల బాధలు తట్టుకోలేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సినీ నటి రేణూ దేశాయ్ ఆరోపించారు, అన్నదాతల ఉసురు తప్పకుండా తగులుతుందని ఆమె చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

రాష్ట్రంలో కరువు నేపథ్యంలో రైతుల కష్టాలపై, ఆత్మహత్యలకు దారి తీస్తున్న పరిస్థితులపై రేణూ దేశాయ్ అధ్యయనం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె సోమవారం కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుంబళబీడు, మండల కేంద్రమైన పెద్దకడబూరులో పర్యటించారు. 

తంబళబీడు గ్రామంలో నిరుడు ఆగస్టు 25న అప్పుల బాధ తాళలేక రైతు దంపతులు నెరణికి బోయరామయ్య, వండ్రమ్మ పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులను రేణుదేశాయ్‌ పరామర్శించారు. అదే విధంగా పెద్దకడబూరులో ఆత్మహత్య చేసుకున్న రైతు పెద్దరంగన్న కుటుంబ సభ్యులతోనూ ఆమె  మాట్లాడారు. వారు చెప్పింది విని ఆమె కంట తడిపెట్టారు. 

ఆయా గ్రామాల్లో రచ్చబండపై రైతులతో ‘సాక్షి టీవీ’ ఆధ్వర్యంలో ముఖాముఖి నిర్వహించారు. తుంబళబీడు గ్రామస్తులు మాట్లాడుతూ పక్కా గృహాలు లేవని, తాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నామని, రోడ్లు బాగోలేవని, పంటలకు జింకల బెడద అధికంగా ఉందని, పంటలు పండక బ్యాంకుల్లో తెచ్చుకున్న రుణాలను చెల్లించలేక పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. 

పెద్దకడబూరులో రైతులు మాట్లాడుతూ... చంద్రబాబు పాలనలో కరువే దిక్కయ్యిందని, పంటలు పండడం లేదని, ఒకవేళ పండినా గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. పత్తి క్వింటాల్‌ రూ.3,500, మిరప క్వింటాల్‌ రూ.6 వేలకు మించి పలకడం లేదన్నారు. 

తాను ప్రజాప్రతినిధిని కానని, ప్రభుత్వ అధికారిణిని కాదని, అయినప్పటికీ ప్రభుత్వం, కలెక్టర్‌ దృష్టికి  రైతుల సమస్యలు తీసుకెళ్లి న్యాయం జరిగేలా కృషి చేస్తానని రేణుదేశాయ్‌ చెప్పారు.