కర్నూలు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య, సినీనటి రేణు దేశాయ్ యాంకర్ అవతారమెత్తారు. కర్నూలు జిల్లాలో ఆమె సాక్షిలోగోతో యాంకరింగ్ చెయ్యడం రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే కర్నూలు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. 

మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇప్పటికే కర్నూలు జిల్లా ఆదోనిలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఇకపోతే రైతాంగ సమస్యలపై అధ్యయనం కోసం  సినీనటి రేణుదేశాయ్‌ కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్నారని తెలుస్తోంది. ఆదివారం రాత్రి మంత్రాలయం చేరుకున్న రేణు దేశాయ్ ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

ఆత్మహత్యకు కారణాలు, బాధిత కుటుంబాల పరిస్థితులు తెలుసుకుంటారు. ఆలూరు మండలం తుంబళబీడుకు చెందిన నెరణికి రామయ్య దంపతులు గతేడాది ఆగస్టులో, అదే ఏడాది డిసెంబర్‌ 25న పెద్దకడబూరుకు చెందిన పెద్దరంగన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్‌ ఆ కుటుంబాలతో సమావేశమయ్యారు. 

ఒక్కసారిగా ఆమె సాక్షి లోగోతో ప్రత్యక్షమవ్వడంతో అంతా గుసగుసలాడుకుంటున్నారు. రేణు దేశాయ్ రైతులకు సంబంధించి ఒక సినిమా తెరకెక్కిస్తున్నారని అందులో భాగంగా ఆమె స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటున్నారని ప్రచారం. 

2014లో రేణుదేశాయ్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ వాలా లవ్ అనే మరాఠీ చిత్రాన్ని తెలుగులో డబ్ చేశారు కూడా. ఈ నేపథ్యంలో ఆమె ఇలా యాంకర్ అవతారం ఎత్తారని ప్రచారం జరుగుతోంది. 

మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవన్ కళ్యాణ్ కు ధీటుగా రేణు దేశాయ్ ను రంగంలోకి దించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే రేణు దేశాయ్ నిర్వహించబోయే కార్యక్రమాలను సాక్షి టీవీ లైవ్ కవరేజ్ మాత్రమే ఇస్తుందని రేణు దేశాయ్ సిబ్బంది చెప్తున్నారు.