వైఎస్ జగన్ బంధువు వైఎస్ కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రహదారి పనుల్లో భాగస్వామ్యం కావాలంటూ కాంట్రాక్టర్ ను బెదిరించడంతో ఆయనపై కేసు నమోదయ్యింది.
కడప : వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం వైసీపీ ఇన్ చార్జ్, సీఎం జగన్ బంధువు YS Konda Reddyని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల జిల్లా చాగలమర్రి- అన్నమయ్య జిల్లా రాయచోటి జాతీయ రహదారి పనుల్లో భాగస్వామ్యం ఇవ్వాలని SRK Constructions Companyను డిమాండ్ చేయడం, లేదంటే నిర్మాణం జరగనివ్వనని బెదిరించడంపై కేసు నమోదైంది. నిందితుడిని అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లె కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ఆతర్వాత నిందితుడిని పోలీసులు రాయచోటి జైలుకు తరలించారు.
చాగలమర్రి - రాయచోటి మధ్య నూట నలభై మూడు కిలోమీటర్లను.. రహదారులు, భవనాల శాఖ రహదారిని కేంద్రం నేషనల్ హైవేగా గుర్తించి రూ. 350 కోట్లు కేటాయించింది. గుత్తేదారు రవి కుమార్ రెడ్డికి చెందిన ఎస్ఆర్ కే కన్స్ట్రక్షన్స్ సంస్థ 30 శాతం లెస్ తో టెండర్ దక్కించుకుని పనులు చేపట్టింది. చక్రాయపేట పరిధిలో నాలుగు కిలోమీటర్ల పొడవున్న రహదారి పనుల్లో తనకు భాగస్వామ్యం ఇవ్వాలని కొండారెడ్డి డిమాండ్ చేశాడు. లేదంటే పనులు జరగనివ్వం అని బెదిరించాడు.
ఈ వ్యవహారం గుత్తేదారు వియ్యంకుడు, కర్ణాటక మంత్రి శ్రీరాములు వరకు వెళ్ళింది. ఆయన ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలకు పరిస్థితి తెలపగా.. వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఉదంతంలో కదలిక వచ్చింది. కొండారెడ్డిని అరెస్టు చేయాలని ఉన్నత స్థాయి నుంచి వచ్చిన ఆదేశాలతో జిల్లా పోలీసులు ఆదివారమే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అధికారికంగా అరెస్టు చూపి రిమాండ్ కు తరలించారు. మరోవైపు సీఎం జగన్ తల్లి విజయమ్మ తరపు వ్యక్తి కొండారెడ్డిని అరెస్టు చేశారని, కుటుంబ విభేదాలు విభేదాలే ఇందుకు కారణమని జిల్లాలో చర్చ జరుగుతోంది.
ఎస్ఆర్ కే కన్స్ట్రక్షన్స్ సంస్థ ఉద్యోగులను బెదిరించిన కేసులో వైఎస్ కొండారెడ్డి చక్రాయపేట పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. ఆయన సోమవారం మాట్లాడుతూ ఈ నెల 5న నిర్మాణసంస్థ ఉద్యోగులకు కొండారెడ్డి ఫోన్ చేసి తాను చెప్పినట్లు చేయకపోతే రోడ్డు పనులు ఆపేస్తారని బెదిరించినట్లు తెలిపారు. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని సోమవారం ఉదయం చక్రాయపేట పోలీసులు కడప సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు.
