ఏపీలో రెడ్ బుక్.. తెలంగాణలో బ్లాక్ బుక్.. ఏందయ్యా ఇది..?
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు రెడ్ బుక్, బ్లాక్ బుక్ పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసినట్లు లోకేశ్ గతంలో అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటంతో కొందరు అధికారుల్లో ఆందోళన నెలకొంది. అలాగే, తెలంగాణలో మాట వినని అధికారుల పేర్లు బ్లాక్ బుక్ లో నమోదు చేస్తున్నామని బీఆర్ఎస్ వార్నింగులు ఇస్తోంది.
ఇప్పుడంతా డిజిటల్ యుగం నడుస్తోంది. సంచులకు సంచులు పుస్తకాలు మెయిన్‌టెయిన్ చేయడం మానేసి.. యూత్ అంతా స్మార్ట్ అయిపోయారు. స్మార్ట్ ఫోన్‌లు, ట్యాబ్‌లతోనే వ్యవహారమంతా నడిపిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం 8వ తరగతి నుంచి విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసింది. అంతా డిజిటల్ చదువులేనని చెప్పకనే చెప్పింది.
అయితే, రాజకీయ పార్టీలు మాత్రం పుస్తకాలతోనే కుస్తీ పడుతున్నాయి. అన్ని వ్యవహారాలు పుస్తకాలతోనే నడిపిస్తున్నాయి. చివరికి తమ మాట వినని.. అధికారంలో ఉన్న పార్టీకి అనుకూలంగా అంటే ప్రభుత్వం చెప్పినట్టు పనిచేసే అధికారులపై కక్ష సాధించేందుకు కూడా పుస్తకాలు చూపించే బెదిరిస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. గతంలో ఏపీలో టీడీపీ రెడ్ బుక్ చూపిస్తే.. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ‘బ్లాక్ బుక్’తో బ్లాక్ మెయిల్ రాజకీయాలు సాగుతున్నాయి.
ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ బుక్ బాగా ఫేమస్. యువగళం పాదయాత్ర సమయంలో రెడ్ బుక్ చూపించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... టీడీపీపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. తాము అధికారంలోకి రాగానే అంతు చూస్తాం. ఎవరినీ వదలం.. అని హెచ్చరించారు. వైసీపీకి కొమ్ముకాసే అధికారులందరి పేర్లు రెడ్ బుక్‌లో నమోదు చేస్తున్నామని నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
యువగళం పాదయాత్ర మొదలైన నాటినుంచి చివరి వరకు అనుమతుల పేరిట పోలీసులు, ఇతర అధికారులు అనేక ఆంక్షలు విధించారు. ప్రారంభంలో పలు చోట్ల సభలకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి.. చివరి నిమిషంలో నిరాకరించారు. ప్రజలతో మాట్లాడేందుకు చిన్నపాటి వేదిక కూడా ఏర్పాటు చేసుకోనీయలేదు. మైక్ కూడా వాడకుండా ఆంక్షలు విధించారు. దీంతో లోకేశ్ అనేకచోట్ల స్టూల్‌పై నిలబడి ప్రసంగాలు చేయాల్సిన పరిస్థితి.
అలాగే, చంద్రబాబు సభలు, పర్యటనల విషయంలో కూడా గత ప్రభుత్వం ఆంక్షలు పెట్టి ఇబ్బందులకు గురిచేసింది. రాయలసీమ ప్రాంతంలో పర్యటనల సమయంలో అంగళ్ల వద్ద పెద్ద ఘర్షణే జరిగింది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో రాళ్ల దాడి కూడా జరిగింది. సాక్షాత్తూ వైసీపీ మంత్రి... చంద్రబాబు పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
ఇలా అనేక ఘటనలతో విసిగిపోయిన నారా లోకేశ్... యువగళం పాదయాత్రలో రెడ్ బుక్ ప్రస్తావన తీసుకొచ్చారు. యువగళం పాదయాత్ర సాగినన్ని రోజులు దాదాపు ప్రతి ప్రసంగంలో రెడ్ బుక్ అంశాన్ని ప్రస్తావించారు. తెలుగుదేశం నేతలు, కార్యకర్తలపై పెద్ద ఎత్తున అక్రమ కేసులు పెడుతున్నారని.. అలాంటి పోలీసు అధికారులను వదలబోమని హెచ్చరించారు. తమను వేధిస్తున్న అధికారులందరి పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయని తెలిపారు.
ఈ నేపథ్యంలో లోకేశ్ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఏపీ సీఐడీ అధికారులు కోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణ సమయంలో సుప్రీంకోర్టులో ఇదే అంశాన్ని ఏపీ సీఐడీ తరఫు లాయర్లు కూడా ప్రస్తావించారు.
ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎవరూ ఊహించని విధంగా కూటమికి 164 అసెంబ్లీ స్థానాల్లో విజయం సొంతమైంది. వైసీపీని 11 స్థానాలకు ప్రజలు పరిమితం చేశారు.
ఈ నేపథ్యంలో ఫలితాల తర్వాత కూడా నారా లోకేశ్ రెడ్ బుక్ గురించి కామెంట్స్ చేశారు. మంగళగిరి సహా పలుచోట్ల ‘రెడ్ బుక్.. సిద్ధం’ పేరిట భారీ ఫ్లెక్సీలు, హోర్డింగులు కూడా వెలిశాయి. ఫలితాల తర్వాత లోకేశ్ మాట్లాడుతూ.. రెడ్ బుక్ విషయంలో తగ్గేదే లేదన్నారు. యువగళం పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రకటనలపై వెనక్కి తగ్గబోనని చెప్పారు. ఈ క్రమంలో పలుచోట్ల వైసీపీ కార్యకర్తలపై జరిగిన దాడులు టీడీపీవాళ్లే చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయా ఘటనలపై స్పందించిన వైసీపీ నాయకులు రాష్ట్రంలో నారా లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
5 పేర్లు లీక్..!
ఇదిలా ఉంటే.. రెడ్ బుక్ లో నుంచి ఐదు పేర్లు లీకయ్యాయంటూ సోషల్ మీడియాలో ఇటీవల చర్చ మొదలైంది. వైసీపీ హయాంలో సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) చీఫ్‌గా వ్యవహరించిన ఐపీఎస్ కొల్లి రఘురాంరెడ్డి, సీఐడీ చీఫ్ సంజయ్, అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, వల్లభనేని వంశీల పేర్లు రెడ్ బుక్‌లో ఉన్నాయని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఈ వార్తలను కొట్టిపారేయడానికి వీల్లేకుండా ఉంది. స్కిల్ డెవలెప్‌మెంటు కేసులో చంద్రబాబు అరెస్టుకు సంబంధించి కొల్లి రఘురాం రెడ్డి, సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ప్రభుత్వం చెప్పింది ఎంతో కానీ, వారు అంతకు మించి చేశారు. చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంటు కేసు కోర్టులో నడుస్తుండగానే.. సంజయ్, సుధాకర్ రెడ్డి వరుస ప్రెస్మీట్లు పెట్టి... నేరం రుజువైపోయిందన్నట్లు ‘తీర్పు’ చెప్పేశారు. ప్రభుత్వ పదవుల్లో ఉన్నామన్న సోయి మరిచిపోయి... ప్రతిపక్ష నేత చంద్రబాబు నేరస్తుడన్నట్లు ఏకపక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ఇక, కొడాలి నాని, వల్లభనేని వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీలు దొరికినప్పుడల్లా చంద్రబాబు, నారా లోకేశ్‌ను దారుణంగా తిట్టిపోశారు. రాజకీయ విమర్శలతో సరిపెట్టకుండా వ్యక్తిగత దూషణలకు దిగారు. అసెంబ్లీలోనూ అనరాని మాటలు అన్నారు. అయితే, తాజాగా ఎన్నికల్లో ఇద్దరూ ఓటమి పాలయ్యారు. ఇప్పటికే కొడాలి నానిపై కేసు నమోదైంది. రాజీనామా చేయాలని బలవంతం చేసి బెదించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుడివాడలో పోలీసులు కొడాలి నానిపై కేసు నమోదు చేశారు. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి మరి.
తాజాగా వివాదాస్పదంగా మారిన వైసీపీ కార్యాలయం కూల్చివేత వెనుక కూడా నారా లోకేశ్ ఉన్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
తెలంగాలో ఇలా....
ఇక, తెలంగాణ విషయానికి వస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సమర్థవంతంగా ఎండగడుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఆర్నెళ్లు అయిందో లేదో... ఆ పార్టీకి చెందిన మంత్రులు, నేతలు అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుంటే... కొందరు అధికారులు సహకరిస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్‌ట్రాలు చేసే అధికారుల కోసం బ్లాక్ బుక్ రెడీ చేస్తున్నామని.... బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక అధికారులకు బ్లాక్ డేస్ ఉంటాయని హెచ్చరించారు.
‘‘అధికారులు జాగ్రత్తగా ఉండండి.. మీకోసం బ్లాక్ బుక్ రెడీ చేసిన.. ఏ అధికారి ఎక్స్‌ట్రాలు చేస్తున్నారో వాళ్ల పేర్లు బ్లాక్ బుక్‌లో ఎంటర్ చేస్తున్న. రేపు మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు అన్ని బ్లాక్ డేస్ ఏ ఉంటాయి జాగ్రత్త’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.