బాకీ తీరుస్తామని .. హోటల్‌కు పిలిపించి రియల్టర్‌ను కిడ్నాప్, సుపారీ గ్యాంగ్‌ను దించి, ఏలూరులో ఆ ప్రముఖుడెవరు
ఏలూరులో ఓ సుపారీ గ్యాంగ్ రియల్టర్‌ను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. అతనిని తుపాకులతో బెదిరించి , చిత్రహింసలకు గురిచేశారు దుండగులు . అయితే ఈ వ్యవహారంలో ఏలూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ప్రమేయం వున్నట్లుగా అనుమానిస్తున్నారు.

ఏలూరులో ఓ సుపారీ గ్యాంగ్ రియల్టర్‌ను కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. అతనిని తుపాకులతో బెదిరించి , చిత్రహింసలకు గురిచేశారు దుండగులు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకకు చెందిన అన్నే కాంతారావు రియల్టర్‌గా పనిచేస్తున్నారు. ఇతనికి సీహెచ్ వినయ్ రెడ్డి హామీ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన దాట్ల బాల వెంకట సత్యనారాయణ అలియాస్ సతీష్ రాజుకు కాంతారావు రూ.50 లక్షలు అప్పుగా ఇచ్చారు.
అయితే ఏళ్లు గడుస్తున్నా సతీష్ బాకీ చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీంతో సెప్టెంబర్ 19న బెంగళూరు సీబీఐ కోర్ట్‌కు వినయ్ రెడ్డి, సతీష్ రాజు వస్తున్నట్లు తెలుసుకున్న కాంతారావు అక్కడికి వెళ్లి ఇద్దరిని బాకీ గురించి నిలదీశాడు. అయితే అప్పుడు ఏదో చెప్పి తప్పించుకున్నారు వినయ్, సతీష్.
ఈ నేపథ్యంలో అప్పు తీరుస్తామని చెప్పి కాంతారావును వీరిద్దరూ గత నెల 27న ఏలూరుకు పిలిపించి.. ఓ హోటల్ గదిలో వుంచారు. అనంతరం నలుగురు దుండుగులు వచ్చి.. తాము తెలంగాణ ఎస్ఎఫ్‌టీ పోలీసులమని, అరెస్ట్ చేస్తామని కాంతారావును బెదిరించి మూడు రోజులు పాటు చిత్రహింసలకు గురిచేశారు. అనంతరం కారులో ఎక్కించి తాడేపల్లిగూడెంలోని ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేస్తామని బెదిరించారు.
అనంతరం గాల్లోకి కాల్పులు జరిపి.. రూ.50 లక్షల బాకీ సంగతి మరచిపోవాలని లేదంటే చంపేస్తామని బెదిరించారు. దీనికి భయపడ్డ కాంతారావు కిడ్నాపర్ల డిమాండ్లకు అంగీకరించడంతో వారు అతనిని మళ్లీ హోటల్‌కు తీసుకొచ్చి వినయ్, సతీష్‌ల వద్ద కూర్చొబెట్టారు. కాంతారావు మిమ్మల్ని డబ్బులు అడగడని.. మ్యాటర్ సెటిల్ చేశామని చెప్పి దుండగులు వెళ్లిపోయారు.
అయితే వారి నుంచి తప్పించుకున్న కాంతారావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే ఈ వ్యవహారంలో ఏలూరుకు చెందిన ఓ ప్రముఖ వ్యక్తి ప్రమేయం వున్నట్లుగా అనుమానిస్తున్నారు. కాంతారావును చిత్రహింసలకు గురిచేసే సమయంలో ఈ తతంగాన్ని వీడియో తీసి సదరు వ్యక్తులకు చూపించేవారు దుండగులు. నగరంలో సంచలనం సృష్టించిన ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సుపారీ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.