Asianet News TeluguAsianet News Telugu

ఫ్లాట్లు, విల్లాల పేరిట ‘‘ రియల్’’ మోసం.. రూ.6 కోట్లు టోకరా: బెజవాడలో బోర్డ్ తిప్పేసిన కేటుగాళ్లు

ఫ్లాట్లు, విల్లాలు, వెంచర్లలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ఆశ చూపిన ఓ నిర్మాణ సంస్ధ జనానికి కుచ్చుటోపీ పెట్టింది. దాదాపు రూ.6 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది.

real estate company cheating in vijayawada ksp
Author
Vijayawada, First Published Jun 12, 2021, 6:52 PM IST

ఫ్లాట్లు, విల్లాలు, వెంచర్లలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ ఆశ చూపిన ఓ నిర్మాణ సంస్ధ జనానికి కుచ్చుటోపీ పెట్టింది. దాదాపు రూ.6 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసింది. వివరాల్లోకి వెళితే.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన పట్నాల శ్రీనివాసరావు గతేడాది ఆగస్టులో విజయవాడ కేంద్రంగా ఎంకే కనస్ట్రక్షన్స్‌ అండ్‌ డెవలపర్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థను ఏర్పాటు చేశారు. గురునానక్‌ కాలనీలోని మహానాడులో కార్యాలయాన్ని తెరిచారు. తదనంతరం హైదరాబాద్‌ వనస్థలిపురంలోనూ ఒక బ్రాంచిని ఏర్పాటు చేశారు. 

ఈ సంస్థకు విజయవాడ సమీపంలోని నున్న గ్రామానికి చెందిన ఉప్పు మనోజ్‌కుమార్‌ ఛైర్మన్‌గా, యద్దనపూడికి చెందిన బలగం రవితేజ డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఈ సంస్థ అభివృద్ధి చేసే స్థలాలు, నిర్మించే గేటెడ్‌ కమ్యూనిటీల్లో విల్లాలు విక్రయించడానికి విజయవాడకు చెందిన 20 మంది యువకులను ఏజెంట్లుగా నియమించుకున్నారు. విక్రయించిన ప్లాట్లలో వారికి రెండు శాతం కమీషన్‌ ఇస్తామని నమ్మబలికారు.

Also Read:నకిలీ యాప్‌లతో రూ. 150 కోట్లమోసం: చైనా ముఠా అరెస్ట్

ప్లాన్‌లో భాగంగా పట్నాల శ్రీనివాసరావు, మనోజ్‌కుమార్‌, రవితేజ, కలిసి ఈ ఏజెంట్లకు విజయవాడకు సమీపంలో ఉన్న గన్నవరం, ముస్తాబాద్‌, ఆగిరిపల్లిలో ఉన్న స్థలాలను, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని పలు వెంచర్లను ఏజెంట్లకు చూపించారు. ఈ స్థలాలను చూసిన ఏజెంట్లు ఎలాగోలా కష్టపడి బుకింగ్స్‌ తీసుకొచ్చారు. కొంత మంది ఏజెంట్లు ముందుగా పెట్టుబడి పెట్టి అడ్వాన్సులు ఇచ్చారు.

అటు భారీగా ఆఫర్లు ప్రకటించడంతో జనం ఎగబడ్డారు. విజయవాడ, గుంటూరు, కడప, శ్రీశైలం, విశాఖపట్నానికి చెందిన సుమారు 100 మంది లక్షల రూపాయలు అడ్వాన్సులుగా ఇచ్చారు. అటు ఏజెంట్ల ద్వారా బుకింగ్స్‌ చేసుకున్న వారంతా రిజిస్ట్రేషన్ల కోసం పట్టుబట్టారు. దీంతో శ్రీనివాసరావు, మనోజ్‌, రవితేజపై ఏజెంట్లు ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో మార్చి నుంచి వీరు ముగ్గురు కార్యాలయానికి రావడం తగ్గించారు. ఆ తర్వాత ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్‌ చేయడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios