అమరావతి: లోకసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తే తాము తలపడడానికి సిద్ధంగా ఉంటామని, అసెంబ్లీకి మాత్రం ముందస్తు ఎన్నికలకు అంగీకరించబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ముందస్తు  ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన అన్నారు. 

జమిలి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచన కూడా చేస్తోందని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ యంత్రాంగం సిద్ధంగా ఉండాలని పిలుపిచ్చారు. గురువారం రాత్రి ఇక్కడ గుంటూరు జిల్లా పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. 

షెడ్యూల్‌ ప్రకారమే మన శాసనసభకు ఎన్నికలు నిర్వహించాలని ఆయన అన్నారు. జమిలి ఎన్నికల పేరుతో లోక్‌సభతో పాటే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా అక్టోబరు, నవంబరుల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం చూస్తోందని అన్నారు. అవసరమైతే న్యాయనిపుణులతో మాట్లాడి న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తామని అన్నారు.

రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 75 బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఇందులో 25 రైతు సభలు, 25 మహిళా సభలు, 25 సంక్షేమ సభలు ఉంటాయని తెలిపారు. నవ్యాంధ్రలో తాము అధికారంలోకి వచ్చి ఈ నెల 16వ తేదీ నాటికి 1500 రోజులు పూర్తవుతాయని, అప్పటి నుంచి ప్రారంభించే గ్రామదర్శిని, గ్రామవికాసం కార్యక్రమాలను తర్వాతి ఆరు నెలల్లో ఒక పండుగ మాదిరిగా నిర్వహించాలని అన్నారు.