జనసేన (Jana Sena) ఆవిర్బావ సభ నేపథ్యంలో జనసైనికులు ఏర్పాటు చేసిన కొన్ని పోస్టర్‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad) ప్రవేశం లేదంటూ జనసైనికులు ఏర్పాటు చేసిన బ్యానర్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
జనసేన (Jana Sena) ఆవిర్బావ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామ పరిధిలో మధ్యాహ్నం 3 గంటలకు జనసేన ఆవిర్భావ సభ ప్రారంభం కానుంది. సభ ప్రాంగణంలోని ఏర్పాట్లను జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, నాయకులు కొణిదెల నాగబాబు ఆదివారం పరిశీలించారు. 2024 ఎన్నికలే టార్గెట్‌గా జనసేన పార్టీ ఈ సభను భారీగా నిర్వహిస్తోంది. పార్టీ ఆవిర్బావ సభలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు Pawan Kalyan కొద్దిసేపటి క్రితం విజయవాడలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. అక్కడ ఆయనకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
జనసేన ఆవిర్భావ సభా ప్రాంగణానికి దామోదరం సంజీవయ్య పేరు పెట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి అయిదు లక్షల మంది వరకు పైగా హాజరవుతారనే అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర క్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా సభకు ఆహ్వానితులేనని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని ఆ పార్టీ ఇవాళ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఏపీ భవిష్యత్తు కోసం జనసేన దిశా నిర్ధేశం చేయనుందని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. దీన్ని తాము జనసేన ఆవిర్భావ దినోత్సవంగా చూడడం లేదని.. ఏపీ దిశా నిర్ధేశాన్ని చూసే సభగా భావిస్తున్నామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జనసేనపై వస్తున్న విమర్శలకు తాము ఈ సభా వేదికగా సమాధానం చెప్పనున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
అయితే జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో జనసైనికులు ఏర్పాటు చేసిన కొన్ని పోస్టర్‌లు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka Varaprasad).. కొద్ది రోజులకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీలో అధికార వైసీపీ మద్దతుగా ఆయన గళం వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే రాపాక వరప్రసాద్‌కు జనసేన ఆవిర్భావ సభకు ఆహ్వానం అందలేదని సమాచారం. మరోవైపు రాపాక వరప్రసాద్‌కు జనసేన బహిరంగ సభకు ప్రవేశం లేదని.. రాజోలు జనసైనికకులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక.. పార్టీకి నమ్మకద్రోహం చేశారని గత కొంతకాలంగా జనసైనికులు ఆయనపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాపాకకు వ్యతిరేకంగా జనసైనికులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక, 2014 అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పవన్ కల్యాణ్.. జనసేన పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే 2014 ఎన్నికల్లో పవన్ పార్టీ పోటీ చేయలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతుగా నిలిచింది. కూటమి తరఫున పవన్ కల్యాణ్ ప్రచారంలో కూడా పాల్గొన్నారు. అయితే ఆ తర్వాత పరిణామలు మారిపోయాయి. 2019 ఎన్నికల్లో జనసే.. వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసింది. అయితే జనసేన తరఫున రాపాక వరప్రసాద్ మాత్రమే విజయం సాధించారు. ఆ తర్వాత అతడు పార్టీకి దూరంగా ఉండటం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. భవిష్యత్తు కార్యచరణపై పవన్ కల్యాణ్ నేటి ఆవిర్బావ సభలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనుంది.
