తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఆకర్ష్ మంత్ర బాగానే పనిచేస్తోంది. ఒకరి తర్వాత మరొకరు సీనియర్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ సీనియర్ నేతలు కషాయం కండువా కప్పుకోగా.. ఆ జాబితాలోకి టీడీపీ సీనియర్ నేత రాయపాటి సాంబశివరావు కూడా చేరిపోయారు.  రాయపాటి టీడీపీ కి వీడ్కోలు పలికనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. త్వరలోనే తాను బీజేపీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు.

గుంటూరులో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న రాయపాటి పార్టీని వీడుతుండటం పెద్ద దెబ్బే. ఈ విషయంపై ఆయన తాజాగా మాట్లాడారు. తాను బీజపీ పెద్దలెవరితో సంప్రదింపులు జరపలేదని చెబుతూనే... ఆ పార్టీలో చేరడం మాత్రం ఖాయమని స్పష్టం చేశారు. రాయపాటి టీడీపీ ఛైర్మన్ పదవి మెలికతోనే టీడీపీలో చేరారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య ఆ పదవి పుట్టా సుధాకర్ యాదవ్ కి దక్కింది. దీంతో... అప్పటి నుంచి  రాయపాటి ఎడముఖం పెడముఖంగా ఉన్నారు. 

ఈ ఎన్నికల్లో టీడీపీ ఎలాగూ అధికారం కోల్పోయింది. ఈ క్రమంలో పార్టీ మారితేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని రాయపాటి భావించారు. అందుకే ఆయన పార్టీ మారడానికే నిర్ణయం తీసుకున్నారు. రెండు రోజుల క్రితం బీజేపీ ముఖ్య నేత ఒకరు రాయపాటి ఇంటికి వెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతో.. రాయపాటి అంగీకరించినట్లు సమాచారం. రెండు మూడు రోజుల్లో ఆయన అధికారికంగా కమలం గూటికి చేరనున్నారు.