గుంటూరు: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆ పార్టీ మాజీ నేత రావెల కిషోర్ బాబు. పవన్ కళ్యాణ్ తనను ఎప్పుడూ గుర్తించలేదని, కనీసం గౌరవించలేదని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ ఏనాడు రాజకీయాలకు సంబంధించి తనతో చర్చించిన దాఖలాలు లేవన్నారు. 

నా సూచనలు పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు. కనీసం తనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. రాజకీయ వ్యూహాలపై మాట్లాడదామని ప్రయత్నించానని కానీ పవన్ కళ్యాణ్ ఆ అవకాశం ఇవ్వలేదని చెప్పారు రావెల కిషోర్ బాబు. 

ఇకపోతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆదర్శాలు చాలా మంచివని కొనియాడారు. సమాజాంలో మార్పుతీసుకురావాలనేటువంటి ఆయన తపన అభినందనీయమన్నారు. అవినీతి రహిత సమాజం, సమ సమాజ స్థాపన నిర్మాణం కోసం పవన్ కళ్యాణ్ పరితపించేవారని చెప్పుకొచ్చారు. 

పవన్ ఆశయాలు నెరవేరాలంటే అధికారాన్ని సాధించాలని కానీ ఆ అధికారాన్ని సాధించే దిశలో పవన్ కళ్యాణ్ విజయవంతం కాలేదన్నారు. అందువల్లే ఘోరంగా ఓటమిపాలయ్యామని చెప్పుకొచ్చారు. 

ఇకపోతే టీడీపీతో జనసేన పార్టీ లోపాయికారి ఒప్పందం చేసుకుందని గ్రామస్థాయిలో ప్రచారం జరిగిందన్నారు. జనసేన పార్టీకి ఓటు వేస్తే టీడీపీకి ఓటు వేసినట్లేనని ప్రజలు నమ్మారని చెప్పుకొచ్చారు. 

టీడీపీకి ఓటు వేస్తే చంద్రబాబు అవినీతి పాలన మళ్లీ వస్తుందని భయపడిన ప్రజలు వైసీపీకి ఏకపక్షంగా ఓట్లు వేశారని మాజీమంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. జనసేనపార్టీకి రాజీనామా చేసిన ఆయన ఇటీవలే బీజేపీలో చేరారు.