ఇదివరకు సిటీలకు మాత్రమే సొంతమైన రేవ్ పార్టీల సాంప్రదాయం.. ఇప్పుడు జిల్లా కేంద్రాలకు కూడా పాకింది. రేవ్ పార్టీల పేరిట.. కర్నూలు నగరంలో యువతులతో చేయించిన అశ్లీల నృత్యాలు కలకలం రేపాయి. వారి నృత్యాలు, ఆ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిల కోసం కొందరు పడిన గొడవలకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ కి చెందిన విస్టా అగ్రిటెక్ ఆగ్రోఫామ్స్ అనే సంస్థ తమ ఏంజెంట్లకు, డీలర్లకు బుధవారం కర్నూలులో రేవ్ పార్టీ ఏర్పాటు చేసింది. కాగా.. ఈ పార్టీలో సాయంత్రం సమయంలో యువతులతో అశ్లీల నృత్యాలు చేయించారు. ఆ మహిళలు తమతో డ్యాన్స్‌ చేయాలని కొంత మంది ఏజెంట్లు, డీలర్లు పట్టుబట్టి గొడవకు దిగినట్లు తెలుస్తోంది. 

ఈ ఘర్షణ తారాస్థాయి చేరుకోవడంతో కొంత మంది సెల్‌ఫోన్‌లో ఆ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
 
సీఐ మహేశ్వరరెడ్డి తన బృందంతో కలిసి అక్కడికి చేరుకునే సరికి పార్టీ ఏర్పాటు చేసిన నిర్వాహకులు, డీలర్లు, ఏజెంట్లు అప్పటికే వెళ్లిపోయారు. దీంతో పోలీసులు ఆ ఫంక్షన్‌ హాలులో ఉన్న సీసీ కెమెరాలను స్వాధీనం చేసుకుని పరిశీలించారు. 

సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన మహిళల అశ్లీల నృత్యాలు వాస్తవమేనని ధ్రువీకరించారు. ఫంక్షన్‌ హాల్‌ యజమాని శ్రీనివాసమూర్తితో పాటు విస్టా అగ్రిటెక్‌ ఆగ్రోఫామ్స్‌ సంస్థ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.