చిత్తూరు: ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా... పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నా మహిళలపై అఘాయిత్యాలు మాత్రం ఆగడంలేదు. తాజాగా ఆంధ్ర ప్రదేశ్ లో ఓ ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడిన దారుణ ఘటన వెలుగుచూసింది. చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని రాయలపేటలో ఓ చిన్నారి పక్కింట్లోని మృగాడి చేతిలో అత్యాచారానికి గురవడమే కాదు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లింది. ఈ దారుణంపై జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. 

అభం శుభం తెలియని ముక్కుపచ్చలారని చిన్నారి అత్యాచారానికి గురయినట్లు తెలియగానే తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. ఆ పసిబిడ్డ పరిస్ధితి తలచుకుంటే హృదయం బరువెక్కుతోందని... ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక క్షేమంగా వుండాలని కోరుకుంటున్నానని అన్నారు. 

కామాంధుడి చేతిలో లైంగికదాడికి గురయిన బాలికకు అధికంగా రక్తస్రావం అవడంతో పరిస్థితి సీరియస్ గా వుందని డాక్టర్లు చెబుతున్న వీడియో చూసి దు:ఖాన్ని ఆపుకోలేకపోయానని అన్నారు. 26ఏళ్ల యువకుడు తన కామవాంఛ తీర్చుకోడానికి చిన్నారిపై ఇంత నీచానికి  ఒడిగట్టాడని... అతడిని కఠినంగా శిక్షించాలని పవన్ సూచించారు. 

మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడాలంటేనే భయపడేలా శిక్షలుండాలని... అవసరమైతే బహిరంగ శిక్షలను అమలుచేయాలని అన్నారు. ఇందుకోసం మహిళా సంఘాలు, సామాజిక వేత్తలు, మేధావులు ప్రభుత్వాలను కదిలించేందుకు ముందుకు రావాలన్నారు పవన్ కల్యాణ్.