ఏడునెలల గర్భిణిపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఇద్దరు యువకులు 20యేళ్ల జైలు శిక్ష విదించింది గుంటూరు న్యాయస్ధానం. 

గుంటూరు : ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ఓ గర్భిణీ పై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష పడింది. నిరుడు ఏప్రిల్ లో జరిగిన ఈ ఘటనపై బుధవారం తీర్పు వెలువడింది. గర్భిణీగా ఉన్న దళిత మహిళ మీద మద్యం మత్తులో ఉన్న ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. 

అడ్డు వచ్చిన ఆమె భర్తను హత్య చేయడానికి ప్రయత్నించారు. ఈ కేసు నిరూపణ కావడంతో నిందితులిద్దరికీ 20 ఏళ్ల జైలు శిక్ష, జరిమానా విధించారు. ఈ మేరకు బుధవారం నాడు గుంటూరు జిల్లా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి ఆర్ శరత్ బాబు తీర్పు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. 

నిరుడు ఏప్రిల్ లో బాపట్ల జిల్లా రేపల్లె రైల్వే స్టేషన్లో జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకత్తించింది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలానికి చెందిన దంపతులకు ముగ్గురు పిల్లలు. భార్య (27)ఆ సమయంలో ఏడో నెల గర్భిణితో ఉంది. వారు కూలీ పనుల కోసం తమ ముగ్గురు పిల్లలను తీసుకొని ఏప్రిల్ లో గుంటూరుకు వచ్చారు.

వారికి అక్కడ ఎవరు తెలిసిన వారు లేకపోవడం…ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేంత స్తోమత లేకపోవడంతో రైల్వే స్టేషన్ లోనే ఉంటూ కూలి పనులకు వెళుతుండేవారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆ దంపతులకు నాగాయలంకలో పని ఉంది వెళ్ళమని చెప్పాడు. నిరుడు ఏప్రిల్ 30వ తేదీన నాగాయలంకకు వెళ్లడం కోసం గుంటూరు నుంచి రైల్లో తమ ముగ్గురు పిల్లలతో కలిసి బయలుదేరారు.

అలా అర్ధరాత్రి 12 గంటల సమయంలో రేపల్లెకు చేరుకున్నారు. ట్రైన్ దిగిన తర్వాత ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ పై పడుకున్నారు. ఆ సమయంలో రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న నేతాజీ నగర్ కు చెందిన పలుచూరి నిఖిల్ (25), పాలుపోయిన విజయకృష్ణ (20), మరో మైనర్ బాలుడు (17) మద్యం సేవించి రైల్వే స్టేషన్ లోకి వచ్చారు. 

కృష్ణా జిల్లాలో డాక్టర్ రాధా హత్య కేసులో పురోగతి.. భర్త సుపారీ ఇచ్చి...

ఆ సమయంలో వారికి ప్లాట్ఫారంపై పడుకున్న కూలి జంట కనబడింది. దీంతో కూలి మీద దాడిగి దిగారు. అతని దగ్గర నగదు లాక్కున్నారు. భర్తను కొడుతుండడంతో భార్య అడ్డు వచ్చింది. ఆమెను కూడా తోసేశారు. దీంతో భర్త సహాయం కోసం దగ్గర్లోని పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు. భర్త వెళ్లడం గమనించిన విజయకృష్ణ, మైనర్ బాలుడు గర్భిణీ అని కూడా చూడకుండా ఆమెని ప్లాట్ఫారం చివరికి లాకెళ్లి.. ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు.

 ఆ తర్వాత నిఖిల్ కూడా ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. అదే సమయంలో భర్త పోలీసులను వెంటబెట్టుకుని వస్తుండడం గమనించి అక్కడి నుంచి ముగ్గురూ పరారయ్యారు. వెంటనే పోలీసులు బాధితులను అక్కడ నుంచి తీసుకెళ్లి కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే.

ఘటన జరిగిన తెల్లారే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. గర్భిణీకి వైద్య పరీక్షల అనంతరం అత్యాచారం జరిగినట్లుగా నిర్ధారించారు. దిశా డిఎస్పి రవిచంద్ర కేసు దర్యాప్తు చేశారు. నిందితులైన నిఖిల్ విజయకృష్ణలపై చార్జి షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్కు అనుగుణంగా సాక్షులు వాంగ్మూలమిచ్చారు. నిందితులిద్దరిపై నేరం రుజువయింది.

దీంతో వీరి మీద అత్యాచారయత్నం, అత్యాచారం, దోపిడీ, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ చట్టాల కింద నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎస్ శారదామణి ప్రాసిక్యూషన్ చేశారు. 

అత్యాచారానికి పాల్పడిన వారిలో మైనర్ ఉండడంతో అతనిపై కేసు విచారణ వేరేగా నిర్వహించాలని పోలీసులు కోర్టులో చార్జి షీట్ దాఖలు చేశారు. దీంతో తెనాలిలో కొత్తగా ఏర్పాటు అయిన ఫోక్సో కోర్టుకు ఈ కేసు బదిలీ అయింది. ప్రస్తుతం ఇది విచారణలో ఉంది.