Asianet News TeluguAsianet News Telugu

పుట్టక ముందే: రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు

తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Ramana Deekshitulu makes controversial comments

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధానార్చకుడు రమణదీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సోమవారం మీడియా సమావేశంలో పలు ఆరోపణలు చేశారు. తాను సిబిఐ విచారణకు సిద్ధంగా ఉన్నానని, తనపై ఆరోపణలు చేసినవారు కూడా విచారణకు సిద్ధపడాలని ఆయన సవాల్ చేశారు 

తాను సామాన్య అర్చకుడనని, పుట్టకముందే శ్రీవారు తనను అర్చకుడిగా నియమించుకున్నారని, తాను మరణించేవరకు స్వామివారికి సేవ చేస్తాననిఆయన అన్నారు.  తనకు ప్రమోషన్లు ఉండవవని, సెలవులు కూడా ఉండవని, అపాయింట్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఉండవని, రిటైర్మెంట్‌ ఉండదని అన్నారు. తన జీవితమంతా శ్రీవారి సేవలోనే గడుపుతానని అన్నారు.

ఇరవై ఏళ్లు ఎందుకు మౌనంగా ఉన్నారని తనపై అభియోగాలు మోపుతున్నారని, ఎంతోమంది జేఈవో అధికారుల పర్యవేక్షణలో టీటీడీ కొనసాగిందని, కొందరు అర్చకులంటే చులకనగా చూసేవారని అన్నారు. వంశపారంపర్య అర్చకులను దేవాలయంలోనే లేకుండా చేయాలని కొందరు చూశారని, ఈ అవమానాలనూ అరాచకాలనూ 24 ఏళ్లుగా భరిస్తూ వచ్చానని ఆయన అన్నారు. 

బాలసుబ్రహ్మణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు జేఈవోలుగా వచ్చారని, బాలసుబ్రహ్మణ్యం రోజు తనకు 50 రూపాయలు కూలీ ఇచ్చేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. నెలకు ఎన్ని రోజులు పనిచేస్తానో అన్ని రోజులే కూలీ ఇచ్చేవారని అన్నారు. కొన్నాళ్ల తర్వాత అర్చకుల జీతాలను రూ. మూడువేలు చేశారని, రోశయ్య హయాంలో రూ. 60వేలు వేతనంగా ఇచ్చారని, అదే మొన్నటివరకు తాను అందుకున్న వేతనమని తెలిపారు. పది రూపాయలు కూడా తాను ఆక్రమంగా సంపాదించలేదని అన్నారు. 

జేఈవోలుగా పనిచేసిన బాలసుబ్రమణ్యం, ధర్మారెడ్డి, శ్రీనివాసరాజు  టీటీడీకి పట్టిన ఏలినాటి శని లాంటి వారని ఆయన ఆరోపించారు. బాలసుబ్రహ్మణ్యం హయాంలో వెయ్యికాళ్ళ మండపాన్ని కూల్చివేశారని, 800 ఏళ్ల చరిత్ర కలిగిన వెయ్యి కాళ్ల మండపాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పినా వినకుండా దాన్ని కూల్చివేశారని అన్నారు. బాలసుబ్రహ్మణ్యం దానికి ఒప్పుకోలేదు. చివరికీ నాపై కక్షగట్టి నాకు వంశపారంపర్యంగా వచ్చిన ఇల్లును కూడా కూల్చేశారు. 

ధర్మారెడ్డి హయాంలో తనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిందని అన్నారు. ఉద్యోగం కోసం ధర్మారెడ్డి మతం మార్చుకున్నారని చెప్పారు. అర్చకులను బెదిరించి పూజలు చేయించిన ఘనత శ్రీనివాసరాజుదని అన్నారు. 

టీటీడీ ఆలయంలో నిధులు ఉన్నాయని బ్రిటిష్‌ మ్యానువల్‌ చాలా స్పష్టంగా రాసి ఉందని, ప్రతాపరుద్రుడు శ్రీవారికి సమర్పించిన అత్యంత అమూల్యమైన బంగారు నగలు నేలమాళిగల్లో ఉన్నాయని, ఆ నిధుల కోసం తవ్వకాలు జరిగాయని  ఆయన అన్నారు. ఆ అక్రమాలను బయటపెట్టినందుకే కక్షగట్టిన అధికారులు, నాయకులు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios