అమరావతి: జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్‌తో బీజేపీ అగ్రనేత రామ్‌మాధవ్ అమెరికాలో భేటీ అయ్యారు. తానా సభల్లో పాల్గొనేందుకు వచ్చిన వీరిద్దిరూ అమెరికాలో భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. ఏపీలో బలపడేందుకు బీజేపీ ప్లాన్ చేస్తోంది.ఇందులో భాగంగానే  బీజేపీ నేతలు అన్ని ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ తరుణంలో  పవన్ కళ్యాణ్‌తో రామ్ మాధవ్ భేటీ కావడం ఏపీ రాజకీయాల్లో  కొత్త రాజకీయ సమీకరణాలకు తెర తీస్తోందా అనే చర్చ సాగుతోంది.

ఏపీ రాష్ట్రంలో బలపడేందుకు బీజేపీ ప్రయత్నాలను ప్రారంభించింది. వచ్చే ఎన్నికల నాటికి  రాష్ట్రంలో ప్రబలమైన శక్తిగా అవతరించేందుకు  బీజేపీ ప్రయత్నాలను చేస్తోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నేతలతో బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నారని  ప్రచారం సాగుతోంది. ఇప్పటికే టీడీపీకి చెందిన నలుగురు ఎంపీలు బీజేపీ తీర్థం పుచ్చుకొన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు, నేతలు కూడ బీజేపీలో చేరనున్నారని ప్రచారం సాగుతోంది.

ఏపీ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గంపై బీజేపీ కేంద్రీకరిస్తోంది. ఈ రాష్ట్రంలో సుమారు 12 శాతం ఓటు బ్యాంకు కాపు సామాజిక వర్గానికి ఉంటుంది.  రాష్ట్రంలో ప్రధానంగా ఉన్న రెండు ప్రాంతీయ పార్టీలు రెండు సామాజిక వర్గాలకు అండగా ఉన్నాయనే అభిప్రాయం ఉంది. ఏపీలో కులాలు ప్రధానంగా ఎన్నికల్లో ప్రభావం చూపనున్నాయి. అయితే కాపు సామాజికవర్గాన్ని తమ వైపుకు తిప్పుకొంటే  రాజకీయంగా ప్రయోజనమని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్టుగా ఉందనే అభిప్రాయాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

తానా సభల్లో పాల్గొనేందుకు జనసేన చీఫ్  పవన్ కళ్యాణ్  హాజరయ్యారు. ఈ సభల్లో కూడ బీజేపీ అగ్రనేత రామ్ మాధవ్ కూడ పాల్గొన్నారు. రామ్ మాధవ్ , పవన్  కళ్యాణ్‌లు రహస్యంగా భేటీ అయ్యారు. తమ భేటీలో రాజకీయ అంశాల ప్రస్తావన ఏమీ లేదని రామ్ మాధవ్ స్పష్టం చేశారు.అయితే వీరిద్దరి భేటీ మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో ఆసక్తి కల్గిస్తోంది.

2014 ఎన్నికల తర్వాత జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని  అప్పటి బీజేపీ చీఫ్ అమిత్ షా పవన్ ను కోరాడు.కానీ, జనసేన పార్టీని పవన్ కళ్యాణ్  నడపుతున్నాడు. ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్‌ పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటును మాత్రమే గెలుచుకొంది. రెండు చోట్ల కూడ పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యాడు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడ పార్టీని నడుపుతాననిపవన్ కళ్యాణ్  ఎన్నికల ఫలితాల తర్వాత కూడ పదే పదే ప్రకటించారు.

పవన్ కళ్యా‌ణ్‌తో భేటీలో స్నేహాపూర్వక భేటీ మాత్రమేనని బీజేపీ నేతలు చెబుతున్నారు. అయితే భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు ఈ భేటీ నాంది ప్రస్తావనగా నిలిచే అవకాశాలను కొట్టిపారేయలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి ఏమీ లేవని పవన్ కళ్యాణ్ కూడ స్పష్టం చేశారు. పాత పరిచయంతోనే రామ్ మాధవ్ ను కలిసినట్టుగా ఆయన చెప్పారు. అయితే ఈ సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. బీజేపీతో తనకు ఎలాంటి శతృత్వం లేదని ఆయన తేల్చి చెప్పారు.