రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన ముగ్గురు సభ్యుల్లో ఇద్దరు అపర కుబేరులే అనిపించుకుంటున్నారు. టిడిపి నుండి సిఎం రమేష్, కనకమేడల రవీంద్రకుమార్ వైసిపి నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే. పై ముగ్గురిలో రమేష్, వేమిరెడ్డి పారిశ్రామిక వేత్తలు.

రాజ్యసభ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్ధులు వేసిన నామినేషన్ల వివరాల ప్రకారం ఇద్దరికీ  భారీగా ఆస్తులున్నాయి. సిఎం రమేష్ ఆస్తుల విలువ రూ. 258 కోట్లు. వేమిరెడ్డి ఆస్తుల విలువ రూ. 230 కోట్లు.  అఫిడవిట్లలో పేర్కొన్న ఆస్తులు, అప్పుల ప్రకారం ఏడీఆర్ సంస్ధ తయారు చేసిన నివేదిక ప్రకారం అభ్యర్ధుల ఆస్తులు, అప్పుల వివరాలు వెలుగు చూశాయి.

రమేష్ కు రూ. 40 కోట్ల విలువైన చరాస్తులుండగా రూ. 218 కోట్ల స్దిరాస్తులు. వేమిరెడ్డికి రూ. 59 కోట్ల చరాస్తులుండగా రూ. 170 కోట్లు స్ధిరాస్తులు. రమేష్ , వేమిరెడ్డికి అప్పులు కూడా ఉన్నాయి లేండి. వేమిరెడ్డికి రూ. 96 కోట్ల అప్పులుండగా, రమేష్ కు రూ. 39 కోట్ల అప్పులున్నాయ్. ఇవి కేవలం ఎన్నికల కమీషన్ కు అభ్యర్ధులు సమర్పించిన ఆస్తులు, అప్పుల వివరాలు మాత్రమే సుమా.