అనంతపురం: శ్వాస సంబంధమైన ఇబ్బందితో చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి వచ్చిన రాజు అనే వ్యక్తికి  చికిత్స అందించకపోవడంతో ఆసుపత్రి ఆవరణలోనే భార్య ఒళ్లోనే ఆయన మరణించాడు.పేరు నమోదు చేసుకొని చేతులు దులుపుకొన్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది.

అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన రాజు శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతూ భార్య, కూతురుతో కలిసి గురువారంనాడు రాత్రి అనంతపురం ప్రభుత్వాసుపత్రికి వచ్చాడు. అనంతపురం ఆసుపత్రి ఓపీ రికార్డులో ఆయన పేరు నమోదు చేశారు. కానీ కనీసం ఆయనకు చికిత్స చేయలేదు.

also read:కరోనా రోగి ఇంటికి రేకులతో సీల్: క్షమాపణ చెప్పిన మున్సిపల్ కమిషనర్

చికిత్స చేయాలని రాజు భార్య, కూతురు వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది చుట్టూ తిరిగారు. కానీ వారిని పట్టించుకోలేదు. ఆసుపత్రిలోకి అడుగు కూడ పెట్టనివ్వలేదు.

ఊపిరాడకపోవడంతో ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. శుక్రవారం నాడు తెల్లవారుజాము వరకు కూడ రాజుకు చికిత్స అందించాలని కోరుతూ కుటుంబసభ్యులు ఆసుపత్రిలో కన్పించిన ప్రతి ఒక్కరిని కూడ వేడుకొన్నారు. కానీ ఫలితం లేకుండా పోయింది. 

ఆసుపత్రి ఆవరణలోనే భార్య ఒళ్లోనే రాజు ప్రాణం పోయింది. శుక్రవారం నాడు  ఉదయం ఈ డెడ్ బాడీపై రసాయనాలు చల్లి మార్చురీకి తరలించారు వైద్య సిబ్బంది.సకాలంలో వైద్యులు స్పందించి చికిత్స అందిస్తే తన భర్త బతికేవాడని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. 

ప్రభుత్వంపై లోకేష్ ఫైర్

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకొన్న ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. రోడ్డుమీదే ప్రాణాలు పోతున్నా పట్టించుకొనేవారు లేరా అని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు అనంతపురం ఆసుపత్రి ఘటనే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మొద్దునిద్రను వీడాలని ఆయన హితవు పలికారు.