విభజన సమస్యలపై చేతులెత్తేసిన కేంద్రం

విభజన సమస్యలపై చేతులెత్తేసిన కేంద్రం

విభజన సమస్యల పరిష్కారం విషయంలో కేంద్రం చేతులెత్తేసింది. గురువారం పార్లమెంటు సమావేశాల సందర్భంగా జరిగిన చర్చపై హోం శాఖమంత్రి రాజ్ నాధ్ సింగ్ చెప్పిన సమాధానం వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. సహచర కేంద్రమంత్రి, ఏపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ‘విభజన సమస్యలను రెండు రాష్ట్రాలే కూర్చుని పరిష్కరించుకోవాలి’ అని స్పష్టంగా ప్రకటించారు. అంటే అర్ధమేంటి? విభజన సమస్యల పరిష్కారంలో కేంద్రం జోక్యం చేసుకోదనే కదా? ఆ విషయాన్ని కూడా చెప్పారు. ‘అవసరమైతేనే కేంద్రం జోక్యం చేసుకుంటుంది’ అన్నారు.

రాజ్ నాధ్ సింగ్ తాజా ప్రకటనతో విభజన సమస్యలు ఎప్పటికీ పరిష్కారం కావన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. ఎందుకంటే, రాష్ట్ర విభజన జరగటమే  అడ్డుగోలుగా జరిగింది. విభజనపై అప్పటి యూపిఏ ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం భాజపా కుమ్మకైన విషయం అందరికీ తెలిసిందే. సమైక్య ఏపిలోని మెజారిటీ జనాల అభిమతాన్ని తుంగలో తొక్కి మరీ అడ్డుగోలుగా విభజించేశారు. హడావుడిగా చేసిన విభజన వల్ల ప్రతీ అంశమూ సమస్యగా మారిపోయింది.

ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కెసిఆర్, చంద్రబాబునాయుడులు సమస్యల పరిష్కారానికి కొంత ప్రయత్నం చేసినా కుదరలేదు. దాంతో ఎక్కడి సమస్యలు అలానే ఉండిపోయాయి. అడ్డుగోలు విభజన వల్ల అప్పులు, సమస్యలన్నీ ఏపిఖాతాలో పడితే, ఆస్తులు, మిగులు బడ్జెట్ తెలంగాణాకు దక్కాయి. అంతేకాకుండా కేంద్రప్రభుత్వ సంస్ధలన్నీ హైదరాబాద్ లోనే ఉండిపోయాయి. కార్పొరేషన్ల విభజన పూర్తిస్ధాయిలో జరగలేదు. హైదరాబాద్ లో ఉండి ఇరు రాష్ట్రాలకు చెందాల్సిన వివిధ కేంద్రప్రభుత్వ రంగ సంస్ధల కార్యాలయాలు, లేదా వాటి సమాన ఆస్తుల విలువ లాంటివి ఏవీ పరిష్కారం కాలేదు.

ఆస్తుల విభజనకు, లేదా సమాన విలువ చెల్లింపుకు తెలంగాణా ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించటం లేదు. మధ్యవర్తిగా ఉండి సమస్యలు పరిష్కరించాల్సిన ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ కూడా పట్టించుకోవటం లేదు. దాంతో విభజన జరిగి మూడున్నరేళ్ళవుతున్నా ఎక్కడి సమస్యలు అలాగే ఉండిపోయాయి. ఈ దశలో కేంద్రాన్ని జోక్యం చేసుకోమని ఏపి ప్రభుత్వం లేఖలు రాసినా ఇంతకాలం పట్టించుకోలేదు. పైగా ‘దొంగలు పడిన ఆర్నెల్లకు....’ అన్న సామెతలాగ సమస్యలను రెండు ప్రభుత్వాలే పరిష్కరించుకోవాలని తీరిగ్గా చెప్పటం విచిత్రంగా ఉంది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos