Asianet News TeluguAsianet News Telugu

టీడీపీ జనసేన పొత్తు.. రాజమండ్రి ఎంపీ సీటును వైసీపీ నిలుపుకోగలదా..?

ఉభయ గోదావరి జిల్లాలకు కీలక పట్టణమైన రాజమండ్రి లోక్‌సభ స్థానంపై ఇప్పుడు అందరి కన్ను పడింది.  గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన మార్గాని భరత్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 

rajamundry lok sabha constituency current political scenario ksp
Author
First Published Jan 19, 2024, 5:01 PM IST

వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయిస్తూ ముందుకు సాగుతున్నారు. గెలవరని తెలిస్తే చాలు తనకు అత్యంత ఆప్తులైనా, సన్నిహితులైనా, బంధువులైనా ఆయన పక్కనపెట్టేస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే ఇలా రెండింటి విషయంలోనూ జగన్ ప్రయోగాలకే పెద్ద పీట వేస్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలకు కీలక పట్టణమైన రాజమండ్రి లోక్‌సభ స్థానంపై ఇప్పుడు అందరి కన్ను పడింది. 

హేమాహేమీలైన నాయకులను అందించిన ఈ గడ్డ ఎప్పటికప్పుడు సరికొత్త తీర్పులు ఇస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తోంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. ప్రస్తుతం అధికార పార్టీకి చెందిన మార్గాని భరత్ ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈసారి కూడా ఇక్కడ పాగా వేయాలని జగన్ భావిస్తున్నారు. కానీ 2024లో అంత ఈజీ కాదని పరిణామాలు చెబుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు కారణంగా రాజమండ్రిలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. దీనికి తోడు ఎంపీ మార్గాని భరత్‌ను రాజమండ్రి సిటీ నుంచి అసెంబ్లీ బరిలో నిలబెట్టారు జగన్. 

మరి రాజమహేంద్రవరం నుంచి వైసీపీ తరపున ఎంపీగా ఎవరు బరిలో దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. అయితే గత ఎన్నికల మాదిరిగానే బీసీ నేతనే ఇక్కడి నుంచి రంగంలోకి దించాలని జగన్ భావిస్తున్నారట. లేనిపక్షంలో గన్నమనేని వెంకటేశ్వరరావు, అవంతీ సీ ఫుడ్స్ అధినేత అల్లూరి ఇంద్రకుమార్ చౌదరి , నిడదవోలు సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకరికి గానీ కొత్త వారికి గానీ జగన్ టికెట్ కేటాయించే అవకాశాలు వున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి. 

టీడీపీ నుంచి చూస్తే.. రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీకి ఎంపీగా ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేనిపక్షంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బరిలో దిగవచ్చు. రాజమండ్రి సిటీ, రూరల్‌తో పాటు లోక్‌సభ పరిధిలోని అనపర్తి, రాజానగరం, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం స్థానాల్లో చౌదరికి అనుచరగణం వుంది. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించే అవకాశాలు లేకపోలేదు. జనసేన నేత కందుల దుర్గేష్‌ కోసం పవన్ కళ్యాణ్ ఈ సీటు కోసం పట్టు పట్టవచ్చు. ఈ ఏడు నియోజకవర్గాల్లోనూ కాపుల ప్రాబల్యం ఎక్కువ కావడంతో పాటు దీనికి అదనంగా టీడీపీ కేడర్ తోడుగా నిలిస్తే వైసీపీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. అయితే జగన్ ప్లాన్స్ .. ఆయనకు వుంటాయిగా. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios