చంద్రబాబు లేఖ వైరల్.. ఆ లెటర్ జైలు నుంచి రాలేదు , మాకు సంబంధం లేదు : రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న లేఖపై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ స్పందించారు . ప్రస్తుతం చంద్రబాబు పేరుతో చెలామణి అవుతున్న లేఖకు, రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పేరుతో మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న లేఖపై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్ రాహుల్ స్పందించారు. ఈ లేఖ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చింది కాదన్నారు. జైలు నిబంధనల ప్రకారం ముద్దాయిలు ఎవరైనా సంతకం చేయబడిన లేఖలు పంపాలంటే ముందుగా అధికారులు పరిశీలిస్తారని రాహుల్ వెల్లడించారు. సంబంధిత అధికారులు ధ్రువీకరించి.. ఆయన సంతకం, స్టాంప్ వేసిన తర్వాతే బయటకు వస్తుందని సూపరిండెంట్ పేర్కొన్నారు. ప్రస్తుతం చంద్రబాబు పేరుతో చెలామణి అవుతున్న లేఖకు, రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ వెల్లడించారు.
ఇక చంద్రబాబు నాయుడు జైలు నుంచి రాసినట్లుగా వున్న లేఖ విషయానికి వస్తే.. అందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుందని, త్వరలోనే బయటికొస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తాను జైలులో లేనని.. ప్రజల హృదయాల్లో వున్నానని , ప్రజల నుంచి తనను ఒక్క క్షణం కూడా ఎవరూ దూరం చేయలేరని టీడీపీ చీఫ్ తెలిపారు. 45 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న తన విలువలు, విశ్వసనీయతను ఎవరూ చెరిపివేయలేరని చంద్రబాబు స్పష్టం చేశారు.
ALso Read: తెలుగు ప్రజలంటే ఎవరు.. బీజేపీలోని మీ బంధువులా, కాంగ్రెస్‌లోని మీ మనుషులా : చంద్రబాబుకు అంబటి కౌంటర్
తన రాజకీయ జీవితమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందని ఆయన తెలిపారు. ఓటమి భయంతో తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేయాలనుకుంటున్నారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తాను మీ మధ్య లేకపోయినా అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిపిస్తూనే వుంటానని ఆయన పేర్కొన్నారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం అనే సూర్యుడి ముందు కారు మబ్బులు వీడిపోతాయని.. సంకెళ్లు తన సంకల్పాలన్ని బంధించలేవని, జైలు గోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని టీడీపీ అధినేత స్పష్టం చేశారు. తను తప్పు చేయను, చేయనివ్వనని ఆయన పేర్కొన్నారు.