గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో ఫిరాయింపు ఎంఎల్ఏల సంగతి ఎలాగున్నా ముందుముందు చంద్రబాబుకు మాత్రం ఇబ్బందులే.  

ఫిరాయింపు ఎంఎల్ఏలకు రాజ్ భవన్ షాక్ ఇచ్చిందా? తాజా సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. మంత్రిపదవుల హామీపై వైసీపీ నుండి టిడిపిలోకి ఫిరాయించిన పలువురు ఎంఎల్ఏల ఆశలపై గవర్నర్ నరసింహన్ నీళ్ళు చల్లినట్లు స్పష్టమవుతోంది. ఫిరాయింపు ఎంఎల్ఏలతో రాజీనామాలు చేయించిన తర్వాత వారిని మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తానంటూ చంద్రబాబునాయుడుకు ఓ సీనియర్ మంత్రిద్వారా గవర్నర్ కబురు పంపినట్లు జరుగుతున్న ప్రచారం అధికారపార్టీలో సంచలనంగా మారింది. గతంలో తెలంగాణాలో జరిగిన పరిణామాలపై అప్పట్లో టిడిపి చర్యలే ఇపుడు ఏపిలో ఫిరాయింపు ఎంఎల్ఏల విషయంలో ప్రతిబంధకాలుగా మారాయి.

తెలంగాణాలో టిడిపి తరపున గెలిచిన ఎంఎల్ఏలు కూడా శాసనసభ్యులుగా రాజీనామాలు చేయకుండానే టిఆర్ఎస్ లో చేరారు. తలసాని శ్రీనివాసయాదవ్ మంత్రిగా కూడా ప్రమాణస్వీకారం చేసారు. అయితే, రాజీనామా చేయకుండానే తలసాని మంత్రిగా బాధ్యతలు స్వీకరించటాన్ని తప్పుపడుతూ టిడిపి నేతలు స్పీకర్ కు ఫిర్యాదు చేసారు. అంతేకాకుండా స్పీకర్ చర్యలపై న్యాయస్ధానాన్ని కూడా ఆశ్రయించారు. కొంతకాలం తర్వాత ఏపిలో కూడా అవే చర్యలకు చంద్రబాబు తెరలేపారు. వైసీపీ నుండి 21 మంది ఎంఎల్ఏలను స్వయంగా ఫిరాయింపులకు ప్రోత్సహించారు. అంతేకాకుండా భూమానాగిరెడ్డి, జలీల్ ఖాన్, జ్యోతులనెహ్రూకు మంత్రిపదవులు ఇస్తామని హామీ కూడా ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది.

ఎంఎల్సీ ఎన్నికలైపోగానే మంత్రివర్గ ప్రక్షాళన చేయాలని చంద్రబాబు కూడా నిర్ణయించినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. దాంతో ఫిరాయింపు ఎంఎల్ఏల్లో మంత్రిపదవులపై ఆశలు మొదలయ్యాయి. ఈ నేపధ్యంలో ‘గవర్నర్ నిర్ణయ’మంటూ పెద్ద బాంబు పేలింది. తలసానితో ప్రమాణస్వీకారం చేయించినందుకు అప్పట్లో గవర్నర్ ను కూడా చంద్రబాబు విమర్శించారు. నిజానికి ముఖ్యమంత్రి మంత్రిపదవి ఇవ్వాలంటే అధికార పార్టీ సభ్యుడే అయివుండాలని ఏమీ లేదు. ఎవరికైనా ఇవ్వవచ్చు. కాకపోతే ప్రతిపక్షం తరరపున గెలిచి మంత్రిపదవి తీసుకోవటమన్నది కేవలం నైతికం మాత్రమే. ప్రస్తుత విషయానికి వస్తే గవర్నర్ తీసుకున్న నిర్ణయంతో ఫిరాయింపు ఎంఎల్ఏల సంగతి ఎలాగున్నా ముందుముందు చంద్రబాబుకు మాత్రం ఇబ్బందులే.