అరేబియా సముద్రప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని మరియు  పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలహీనపడిందని వాతావరణ శాఖ పేర్కొంది. అంతే కాకుండా ఈ నెల 13న బంగాళఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది.

దాంతో మూడు రోజులపాటు తెలుగురాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే  అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఉత్తర కోస్తాలో రేపు, ఎల్లుండి ఉరుములతో కూడిన వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు దక్షిణ కోస్తాంధ్రలోనూ రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు  కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

భారీ వర్షాల కారణంగా కృష్ణానదిలో వరద ఉద్ధృతి పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఐదు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఈ ఏడాది శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది నాలుగోసారి.

ఇన్‌ఫ్లో 1,98,239 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 1,40,007 క్యూసెక్కులుగా ఉంది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తి స్థాయి  నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.80 అడుగుల మేర నీరు వుంది.