ఎండలు మండిపోతున్న వేళ.. కోస్తా ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. 

ఎండలు మండిపోతున్న వేళ.. కోస్తా ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు తెలిపింది. కోస్తా జిల్లాలకు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏప్రిల్ 11, 13 తేదీల్లో పలుచోట్ల ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు..

ఇదిలా ఉంటే రాయలసీమలో మాత్రం ఎండలు ఇంకాస్త మండిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాయలసీమలో ఉష్ణోగ్రతల్లో సాధారణం కంటే ఒకటి రెండు డిగ్రీలు పెరిగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.

రెండు రోజుల ముందు వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచికొట్టాయి. గత రెండు రోజుల నుంచి మాత్రమే కాస్త వాతావరణం చల్లపడి.. ఎండ తీవ్రత కాస్త తగ్గంది. అయితే... 2018తో పోల్చుకుంటే 2019 వేసవిలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. 

దేశవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రతలు 0.5 డిగ్రీల సెల్సియస్‌ పెరిగే అవకాశముందని, అన్నిప్రాంతాల్లోనూ తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ జూన్‌ కాలంలో ఉత్తర, మధ్య భారతంలో సగటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల 0.5 డిగ్రీల సెల్సియస్‌గా ఉండనుంది. ఎల్‌నినో, మధ్య పసిఫిక్‌ మహాసముద్రం నుంచి వస్తున్న వేడిగాలులు భారత్‌లో విపరీతమైన వేడికి, ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణమవుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.