సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని.. హైదరాబాద్- విజయవాడకు ప్రత్యేక రైలు సర్వీసులను రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. కాగా.. ఈ విషయంపట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

అత్తగారి దశదిన కార్యక్రమాల కోసం వెంకటాచలం వెళ్లిన వెంకయ్యనాయుడు అక్కడ నుంచి తిరిగి రైలు మార్గంలో రేణిగుంట చేరుకున్నారు. ఈ ప్రయాణంలో భాగంగా విజయవాడ డి.ఆర్.ఎం ధనుంజయులు  సహా పలువురు రైల్వే అధికారులతో సమావేశమయ్యిరు.

సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని సూచించారు. దీని పై స్పందించిన రైల్వే శాఖ, జనసాధారణ్ పేరిట సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 07192 నెంబరు గల సర్వీసు, అదే విధంగా విజయవాడ నుంచి హైదరాబాద్ కు 07193 నెంబరు గల సర్వీసుతో రెండు రైళ్ళు నడుపుతున్నట్లు ప్రకటించింది. 

ఈ రెండు రైళ్ళ ద్వారా జనవరి 11 నుంచి 20 వరకూ తొమ్మిది రోజుల పాటు మొత్తం 18 సర్వీసులను నడపనున్నట్లు వెల్లడించాయి. తన సూచనకు స్పందిస్తూ వెంటనే ప్రత్యేక రైల్వే సర్వీసులకు ఆమోదం తెలుపడం పట్ల ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. చొరవ తీసుకున్న రైల్వే అధికారులకు అభినందనలు తెలిపారు.

 ఉభయతెలుగు రాష్ట్రాలకు చెందిన వారు పండుగకు ఇంటికి వెళ్ళేందుకు ఈ సర్వీసులు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. డైనమిక్ రేట్ల కారణంగా ఇబ్బంది పడుతున్న సామాన్యులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన ఈ రైళ్ళను ప్రజలు వినియోగించుకోవాలని ఉపరాష్ట్రపతి ఆకాంక్షించారు.