ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే ప్రాజెక్ట్‌లను ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆయన పార్లమెంట్‌కు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రైల్వే ప్రాజెక్ట్‌లను (railway projects in ap) ప్రకటించడం సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ బాలశౌరి (vallabhaneni balashowry) అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (ashwini vaishnaw) లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహాయ నిరాకరణే కారణమని వ్యాఖ్యానించారు. రైల్వే ప్రాజెక్ట్‌లు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కేంద్రానికి సహకరించేలా చేయాలని బాలశౌరిని అశ్విని వైష్ణవ్ కోరారు. ఈ విధంగా చేయడం వల్ల ప్రస్తుతం వున్న ప్రాజెక్ట్‌లు వేగంగా పూర్తి అవుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రూ.70 వేల కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్ట్‌లు కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఏపీ తన వాటా కింద రూ.1,798 కోట్లను భరాయించాల్సి వుందని వైష్ణవ్ అన్నారు. కానీ రాష్ట్రం తన నిధులను విడుదల చేయడం లేదని ఆయన పేర్కొన్నారు.
Also Read:ఏపీ, తెలంగాణలలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై కేంద్రం సమాధానం.. ఏం చెప్పిందంటే.
ఇకపోతే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాలలో అసెంబ్లీ సీట్ల పెంపు అంశంపై బుధవారం కేంద్రం సమాధానమిచ్చింది. అసెంబ్లీ స్థానాల పెరుగుదలకు రాజ్యాంగ సవరణ అవసరమని కేంద్రం పేర్కొంది. అసెంబ్లీ స్థానాల పెరగాలంటే.. 2026 వరకు వేచి చూడాల్సిందేనని తెలిపిందే. అప్పటివరకు ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లను పెంచలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం రాతపూర్వక సమాధానం ఇచ్చింది. గతంలో కూడా కేంద్రం ఇదే విషయాన్ని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గత ఏడాది కూడా పార్లమెంట్ వేదికగా ఇదే విషయాన్ని కేంద్రం స్పష్టం చేసింది. 2026 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి వాటిల్లో సీట్లు పెంచే ఆలోచన తక్షణమే లేదని కేంద్రం పేర్కొంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 170 (3) ప్రకారం, 2026 తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య పెంపు ఉంటుందని తెలిపింది. “ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014లోని సెక్షన్ 26(1) ప్రకారం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 170లో ఉన్న నిబంధనలకు లోబడి, ఈ చట్టంలోని సెక్షన్ 15 ఎటువంటి పక్షపాతం లేకుండా.. ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225, తెలంగాణలో 119 నుంచి 153 స్థానాలకు పెంచబడతాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం, 2026 సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించిన తర్వాత ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్య తిరిగి సర్దుబాటు చేయబడుతుంది’’ అని కేంద్రం చెప్పింది. కేంద్రం చెబుతున్న రూల్స్ ప్రకారం 2031 జనాభా గణన తర్వాతే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెరుగుదల లేనట్టేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
