తిరుపతి: కాంగ్రెస్ హోదా భరోసాయాత్ర బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోదీపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీ ఏమైందని నిలదీశారు. 

తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని హామీ ఇచ్చిన ప్రధాని ఎన్నికల అనంతరం ఇచ్చిన మాట తప్పారని ఆరోపించారు. ప్రత్యేక హోదాతోపాటు ఏడాదికి 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తానని హామీ ఇచ్చారని అది ఏమైందన్నారు. 

ఎన్నికలు పూర్తైన వెంటనే దేశంలో అవినీతిని అంతం చేస్తామని చెప్పారని కానీ అవినీతిని అంతం చెయ్యడం ఎలా ఉన్నా అవినీతికి అడ్డాగా మారారని ఆరోపించారు. జన్ ధన్ యోజన పథకం ద్వారా ప్రతీ అకౌంట్ లో రూ.15వేలు అకౌంట్లో జమ చేస్తామని చెప్పిన మోదీ ఎవరి అకౌంట్లో అయినా వేశారా అని నిలదీశారు. 

రైతుల పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తానని హామీ ఇచ్చిన ప్రధానిని దానికి కూడా నెరవేర్చలేదని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీని మోదీ నిలబెట్టుకోలేదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ప్రత్యేక హోదా ఇచ్చితీరుతాం: రాహుల్ గాంధీ